Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ నాలుగు కార్లు ఎక్కడ..? వాటి నిండా డబ్బేనట..!

పశ్చిమ బెంగాల్‌లో పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అరెస్టయిన పార్థా ఛటర్జీ చుట్టూ ఈడీ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టిన తనిఖీల్లో పార్థా సన్నిహితురాలు,

Updated : 29 Jul 2022 18:40 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ చుట్టూ ఈడీ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టిన తనిఖీల్లో పార్థా సన్నిహితురాలు, సినీ నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు చెందిన నాలుగు లగ్జరీ కార్లను వెతికే పనిలో అధికారులు ఉన్నారు. ఆ కార్లలో పెద్ద ఎత్తున డబ్బు దాచిపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అర్పితా ముఖర్జీని అరెస్టు చేసే సమయంలో ఆమెకు చెందిన ఓ తెల్లరంగు మెర్సిడెస్‌ కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీంతో పాటు ఆమెకు ఆడీ ఏ4, హోండా సిటీ, హోండా సీఆర్‌వీ, మరో బెంజ్‌ కారు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అర్పిత అరెస్టయినప్పటి నుంచి ఈ నాలుగు కార్లు కన్పించట్లేదు. దీంతో ప్రస్తుతం ఆ వాహనాల కోసం అధికారులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. అర్పితా ముఖర్జీకి చెందిన మరో నివాసంలో ఈడీ అధికారులు నిన్న రాత్రి సోదాలు జరిపారు. అయితే ఆ ఇంట్లో ఎలాంటి నగదు లభించలేదని అధికారిక వర్గాల సమాచారం. మరోవైపు, అర్పిత ఇంటి చిరునామాతో ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అంతకుముందు అర్పితకు చెందిన రెండు ఫ్లాట్లలో ఈడీ జరిపిన సోదాల్లో దాదాపు రూ.50కోట్ల నగదు, బంగారు ఆభరణాలు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పార్థా అనుచరులే ఇక్కడ దాచిపెట్టి ఉంటారని అర్పిత చెప్పారు. డబ్బు బయటపడిన గదిలోకి తనను వెళ్లనిచ్చేవారు కాదని ఆమె దర్యాప్తులో చెప్పినట్లు తెలుస్తోంది.

నాపై కుట్రలు చేస్తున్నారు: పార్థా

ఈ కుంభకోణం వ్యవహారంపై పార్థా ఛటర్జీ తాజాగా స్పందించారు. ఈ కేసులో ఇరికించేందుకు తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నోట్ట కట్టల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపడంతో పార్థాను నిన్న మంత్రి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. టీఎంసీ పార్టీ నుంచి కూడా సస్పెండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని