Karni Sena : రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడిపై కాల్పులు.. వెన్నులో దిగిన బుల్లెట్‌

రాజస్థాన్‌ (Rajasthan) రాష్ట్రంలోని ఉదయ్‌పుర్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు బన్వర్‌సింగ్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. 

Published : 13 Aug 2023 15:55 IST

జైపుర్ : రాజస్థాన్‌ (Rajasthan) రాష్ట్రంలో రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు బన్వర్‌సింగ్‌పై ఓ వ్యక్తి తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఉదయ్‌పుర్‌లో రాజ్‌పుత్ కర్ణిసేన ఆధ్వర్యంలో ఇవాళ ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి అధ్యక్షుడు బన్వర్‌ సింగ్‌ హాజరయ్యారు. ఆయన వేదికపై నుంచి కిందికి దిగి వెళ్తుండగా.. అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి బన్వర్‌సింగ్‌ వైపు తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.

70 అడుగుల లోతు బోరులో ఇరుక్కుపోయిన కార్మికుడు..!

ఈ హఠాత్పరిణామంతో కంగుతున్న స్థానికులు వెంటనే నిందితుణ్ని పట్టుకున్నారు. అతణ్ని మాజీ సభ్యుడు దిగ్విజయ్‌గా గుర్తించారు. వెంటనే కర్ణిసేన కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాదారు. కాళ్లతో తన్నుతూ రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని సాధారణస్థితికి తీసుకొచ్చారు. ఈ దాడి ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేయడానికి నిందితుడు దేశవాళీ తుపాకీని వినియోగించాడని తెలిపారు. గాయపడిన నిందితుడు దిగ్విజయ్‌, బాధితుడు బన్వర్‌సింగ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాగా.. బన్వర్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

దాడి ఘటనపై కర్ణిసేన జాతీయాధ్యక్షుడు మహిపాల్‌ మక్రానా స్పందించారు. కర్ణిసేనను దెబ్బతీయడానికి రాజకీయ దురుద్దేశంతోనే ఈ దాడి చేశారని ఆయన ఆరోపించారు. బన్వర్‌ సింగ్‌ వెన్నులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో వైద్యులు ఆయనను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాగా, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజ్‌పుత్ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యంగా కర్ణిసేన వరుస కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని