Pratik Doshi: నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్‌ ఎవరో తెలుసా?

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కుమార్తె వాజ్ఞ్మయి వివాహం ప్రతీక్‌ అనే యువకుడితో అత్యంత నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అల్లుడు ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..

Published : 09 Jun 2023 17:22 IST

దిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Niramala Sitharaman), పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి(Vangmayi) వివాహం వరుడు ప్రతీక్‌(Pratik Doshi)తో అత్యంత నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో బెంగళూరు(Bengaluru)లోని మంత్రి ఇంట్లోనే బుధవారం ఈ పెళ్లి వేడుకను పూర్తి చేశారు. రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఎవరూ ఈ పెళ్లి వేడుకకు హాజరుకాలేదు. పెళ్లి సమాచారాన్ని సీతారామన్‌ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించకున్నా.. వివాహ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్‌ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన వివరాల కోసం నెటిజన్లు గూగుల్‌లో శోధించడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరీ ప్రతీక్‌?ఆయనేం చేస్తుంటారు? వంటి కొన్ని విశేషాలివే..

ప్రతీక్‌ దోషీ(Pratik Doshi).. గుజరాత్‌కు చెందిన ఈ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో కీలక వ్యక్తిగా పనిచేస్తున్నారు. మోదీ 2014లో ప్రధాని అయినప్పటి నుంచి పీఎంవోతో ఆయనకు అనుబంధం కొనసాగుతోంది. 2019 జూన్‌లో ఆయన పీఎంవోలో జాయింట్‌ సెక్రటరీ ర్యాంకులో ఓఎస్‌డీ (రీసెర్చి& స్ట్రాటజీ)గా నియమితులయ్యారు. ఒకరకంగా ప్రధానికి కళ్లు, చెవులూ తానై ప్రతీక్‌ వ్యవహరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. జాతీయ పత్రికలు సైతం ప్రతీక్‌ను ఇలాగే వ్యవహరిస్తుండటం గమనార్హం. సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌లో ఎంబీఏ చేసిన ప్రతీక్‌.. అంతకుముందు నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో సీఎంవోలో రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రచారానికి దూరంగా ఉండే ప్రతీక్‌.. సోషల్‌ మీడియాలోనూ అంత చురుగ్గా ఏమీ ఉండరు.

మరోవైపు, నిర్మలా సీతారామన్‌ కుమార్తె పరకాల వాజ్ఞ్మయి కాలమిస్ట్‌గా ఉన్నారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. అమెరికాలోని మాసాచూసాట్స్‌లోని బోస్టన్‌లో నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలోని మిడిల్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం నుంచి పట్టా సాధించారు. ఆ తర్వాత ప్రముఖ వార్తా సంస్థకు ఫీచర్‌ రైటర్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని