Bhagwad Gita: గుజరాత్‌ బాటలో కర్ణాటక.. బడిలో భగవద్గీత బోధన..!

గుజరాత్‌లోని పాఠశాలల్లో భగవద్గీతను బోధనాంశంగా చేరుస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. తాజాగా కర్ణాటక కూడా ఇదే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది

Published : 19 Mar 2022 01:26 IST

బెంగళూరు: గుజరాత్‌లోని పాఠశాలల్లో భగవద్గీతను బోధనాంశంగా చేరుస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. తాజాగా కర్ణాటక కూడా ఇదే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. అయితే అంతకంటే ముందు విద్యానిపుణులతో చర్చించి దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి.సి. నగేశ్‌ వెల్లడించారు. ఇటీవల కాలంలో పిల్లల్లో సాంస్కృతిక విలువలు పడిపోతున్న నేపథ్యంలో చాలా మంది మోరల్‌ సైన్స్‌ను పాఠశాలల్లో బోధించాలని కోరుతున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 

‘‘గతంలో పాఠశాలల్లో వారానికోసారి మోరల్‌ సైన్స్‌ తరగతి ఉండేది. అందులో రామాయణం, మహాభారతం వంటి వాటిని నేర్పించేవారు. రాజనీతజ్ఞులు కూడా వీటి నుంచి ప్రేరణ పొందినవారే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారి అవన్నీ చెప్పడం మానేశారు. అయితే తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం స్కూళ్లలో భగవద్గీతను బోధించాలని నిర్ణయించింది. ఈ విషయం తెలిసి మేం కూడా అదే దిశగా ఆలోచిస్తున్నాం. దీనిపై రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి సూచనలు తీసుకుంటాం. విద్యానిపుణులతో చర్చించిన అనంతరం మోరల్‌ సైన్స్‌ క్లాసులను తీసుకొస్తాం’’ అని నగేశ్ తెలిపారు. 

2022-23 విద్యా సంవత్సరం నుంచి 6-12 తరగతుల్లో భగవద్గీత బోధన ప్రారంభవుతుందని గుజరాత్‌ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 6-8 తరగతులకు చిన్నచిన్న కథలు, శ్లోకాల రూపంలో సమగ్ర విద్య విధానంలో గీతా బోధన ఉంటుందని, 9-12 తరగతులకు కథల రూపంలో ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పుస్తకంలో ఉంటుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జితు వాఘాని అసెంబ్లీలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని