Lakshadweep: దర్శకురాలిపై రాజద్రోహం కేసు

లక్షద్వీప్ ఫిల్మ్‌మేకర్ ఆయిషా సుల్తానాపై రాజద్రోహం, విద్వేశపూరిత ప్రసంగం ఆరోపణలతో పోలీసు కేసు నమోదైంది.

Updated : 11 Jun 2021 18:12 IST

ఎర్నాకుళం: లక్షద్వీప్‌లో సినీ దర్శకురాలు అయేషా సుల్తానాపై రాజద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్‌ ప్రజలపై కేంద్రం కొవిడ్‌ను జీవాయుధంగా ప్రయోగించిందని, కొవిడ్‌ను కట్టడి చేయడంలో అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ కూడా విఫలమయ్యారంటూ ఓ టీవీ చర్చలో భాగంగా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అక్కడి భాజపా అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై ఈ కేసు నమోదైంది.

గత ఏడాది మొత్తం ఒక్క కరోనా కేసు సైతం నమోదు కాని లక్షద్వీప్‌లో ఇప్పుడు బయటివారి రాకపోకలు పెరిగి దాదాపు 7,000 కేసులు నమోదయ్యాయి. కేవలం 65వేల జనాభాగల ఈ దీవుల్లో కరోనా పాజిటివ్‌ రేటు ప్రస్తుతం దేశంలోనే అత్యధికం. ఈ క్రమంలో అయేషా.. టీవీ చర్చలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘లక్షద్వీప్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు రోజుకు సుమారు 100 మందికి వైరస్ సోకుతోంది. లక్షద్వీప్‌ ప్రజలపై కేంద్రం జీవాయుధం ప్రయోగించింది. అడ్మినిస్ట్రేటర్‌ ప్రపుల్‌ కూడా కరోనాను కట్టడి చేయడంలో విఫలమయ్యారు’ అంటూ గతవారం పటేల్ వైఖరిపై మండిపడ్డారు.

గుజరాత్ మంత్రిగా పనిచేసిన ప్రఫుల్ పటేల్ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులైన దగ్గరి నుంచి అక్కడ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయన చర్యలు తమ ‘జీవితాలు, జీవనోపాధి, సంస్కృతి’కి నష్టం కలిగిస్తున్నాయని పలు వర్గాల ప్రజలు అంటున్నారు. వారు ‘సేవ్‌ లక్షద్వీప్’ అంటూ ఉద్యమరూపంలో తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిర్ణయాలను పునఃపరిశీలించాలని భాజపాలో ఓ వర్గం కూడా కోరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని