Prince Raj: ఎల్‌జేపీ ఎంపీపై రేప్‌ కేసు.. చిరాగ్‌ పాసవాన్‌పైనా అభియోగాలు

లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాసవాన్‌ సోదరుడు, ఎంపీ ప్రిన్స్‌ రాజ్‌పై దిల్లీలో రేప్‌ కేసు నమోదైంది. కాగా.. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో చిరాగ్‌ పేరు కూడా ఉన్నట్లు

Updated : 14 Sep 2021 16:56 IST

దిల్లీ: లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాసవాన్‌ సోదరుడు, ఎంపీ ప్రిన్స్‌ రాజ్‌పై దిల్లీలో రేప్‌ కేసు నమోదైంది. కాగా.. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో చిరాగ్‌ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్‌ రాజ్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ మూడు నెలల కిందట ఓ మహిళ దిల్లీలోని కన్నౌట్‌ప్లేస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోకుండా చిరాగ్‌ అడ్డుపడ్డారని ఆరోపించింది. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించడంతో ఈ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ప్రిన్స్‌ రాజ్‌, చిరాగ్‌పై కేసు నమోదు చేశారు.

బాధితురాలు ఎల్‌జేపీ పార్టీ కార్యకర్తగా తెలుస్తోంది. గతేడాది పార్టీకి చెందిన ఓ కార్యక్రమంలో తొలిసారి ప్రిన్స్‌ రాజ్‌ను కలిశానని, అప్పుడే తమ మధ్య పరిచయం ఏర్పడిందని సదరు మహిళ తెలిపింది. ‘‘ప్రిన్స్‌ రాజ్‌ను నేను చాలా సార్లు కలిశాను. అలా ఒకసారి ఆయన ఆఫీస్‌కు వెళ్లినప్పుడు టేబుల్‌ మీద ఉన్న వాటర్‌ బాటిల్‌ను తీసుకోబోతుండగా ఆయన వారించారు. ఆ తర్వాత లోపలకు వెళ్లి మరో బాటిల్ తీసుకొచ్చారు. అందులోని నీళ్లు తాగగానే నేను స్పృహ కోల్పోయా. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన నా పక్కనే కన్పించారు. ఏం జరిగిందని అడగ్గా ఒక వీడియో చూపించారు. ఆయన నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి బయటకు చెబితే ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించారు. ఈ విషయాన్ని చిరాగ్ పాసవాన్‌ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు సరికదా.. ప్రిన్స్‌ రాజ్‌పై పోలీసులు చర్యలు తీసుకోకుండా కుట్రలు చేశారు’’ అని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ఈ ఆరోపణలను ప్రిన్స్‌ రాజ్‌ ట్విటర్‌ వేదికగా తీవ్రంగా ఖండించారు. అవన్నీ నిరాధారమని, తన పరువుకు భంగం కలిగించేందుకే ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని