AIIMS-Delhi: ఎయిమ్స్ దిల్లీ డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌

దేశ రాజధాని దిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. దిల్లీ ఎయిమ్స్‌ ప్రస్తుత డైరెక్టర్‌ రణదీప్‌

Published : 23 Sep 2022 17:39 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. దిల్లీ ఎయిమ్స్‌ ప్రస్తుత డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో హైదరాబాద్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీ డీన్‌ శ్రీనివాస్‌ను నియమించారు. ఈ మేరకు కేంద్ర నియామక, శిక్షణ విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా గులేరియా పదవీకాలం శుక్రవారంతో ముగుస్తుంది. దీంతో శనివారం శ్రీనివాస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు లేదా 65ఏళ్లు వచ్చే వరకు (ఏదీ ముందుగా వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు) కొనసాగనున్నారు. శ్రీనివాస్‌ 2016లో ఈసీఐ ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు దిల్లీ ఎయిమ్స్‌లో పీడియాట్రిక్‌ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

2017 మార్చిలో రణదీప్‌ గులేరియా ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చితోనే ముగిసినప్పటికీ.. మూడు నెలల చొప్పున రెండు సార్లు పొడిగించారు. ఆ పదవీకాలం కూడా పూర్తవ్వడంతో కొత్త డైరెక్టర్‌ కోసం నియామక ప్రక్రియ చేపట్టారు. తొలుత ఈ పదవికి పలువురి పేర్లు వినిపించినా.. ఇటీవల డాక్టర్‌ శ్రీనివాస్‌ పేరును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఎంపిక/శోధన కమిటీ సిఫార్సు చేసింది. ఆయనతో పాటు తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సంజయ్‌ బిహారీ పేరునూ కమిటీ ప్రతిపాదించింది. వీరిలో ఎం.శ్రీనివాస్‌ పేరును కేబినెట్‌ నియామక కమిటీ ఆమోదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు