Maharashtra: 5 స్థాయుల్లో ఆంక్షల సడలింపు!

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఆంక్షలు జూన్‌ 15వరకు కొనసాగుతున్నప్పటికీ ఆ తర్వాత సడలించే ఆంక్షల వ్యూహాన్ని ప్రభుత్వం ముందుగానే వెల్లడించింది.

Updated : 03 Jun 2021 19:10 IST

అన్‌లాక్‌ వ్యూహాన్ని వెల్లడించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబయి: కరోనా ధాటికి అతలాకుతలమైన మహారాష్ట్రలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వైరస్‌ ఉద్ధృతి ఉన్నప్పటికీ చాలా జిల్లాల్లో కరోనా తీవ్రత నియంత్రణలోకి వచ్చింది. దీంతో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడున్న ఆంక్షలు జూన్‌ 15వరకు కొనసాగుతున్నప్పటికీ ఆ తర్వాత సడలించే ఆంక్షల వ్యూహాన్ని ప్రభుత్వం ముందుగానే వెల్లడించింది. కొవిడ్‌ తీవ్రతను బట్టి ఆయా జిల్లాలను ఐదు స్థాయులుగా వర్గీకరించిన ప్రభుత్వం, వాటికి అనుగుణంగా ఆంక్షలను సడలిస్తామని తెలిపింది.

లెవెల్‌ 1లో ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను మొత్తం ఎత్తివేయనున్నారు. థియేటర్లు, మాల్స్‌, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయవచ్చు. వివాహాలు, అంత్యక్రియలు, సినిమా షూటింగులపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగా ఉండి, ఆసుపత్రుల పడకలు 25శాతం కన్నా తక్కువ నిండిన జిల్లాలను ఇందులో చేర్చారు. థానే, నాసిక్‌, ఔరంగాబాద్‌, నాందేడ్‌ వంటి మొత్తం 18 జిల్లాలు ఈ విభాగంలో ఉన్నాయి.

వైరస్‌ తీవ్రత కాస్త అదుపులో ఉన్న జిల్లాలను లెవెల్‌ 2లో చేర్చారు. అక్కడ మాత్రం నలుగురు వ్యక్తుల కంటే ఎక్కువగా గుమిగూడకుండా సెక్షన్‌ 144ను అమలు చేస్తారు. రెస్టారెంట్లు, జిమ్‌, సెలూన్‌, బ్యూటీ పార్లర్లు 50శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అమరావతి, హింగోలి, ముంబయి, నందూర్‌బార్‌ జిల్లాలు ఇందులో ఉన్నాయి. అయితే, ముంబయిలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 5శాతానికంటే తక్కువగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అన్‌లాక్‌ చేయకూడదని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ భావిస్తోంది. అందుకే దీన్ని లెవెల్‌ 2లో చేర్చింది. జూన్‌ 15వరకు పరిస్థితులను సమీక్షించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ముంబయి లోకల్‌ రైళ్లను మాత్రం నడపబోమని బీఎంసీ స్పష్టం చేసింది.

కరోనా పాజిటివిటీ 10శాతం కంటే తక్కువగా ఉన్న జిల్లాల్లో వివిధ కార్యకలాపాలకు ఉదయం 11 గంటల వరకు  మినహాయింపు ఉండగా, దాన్ని మధ్యాహ్నం 2గంటల వరకు పొడిగించారు. ఆయా జిల్లాల్లో కరోనా పాజిటివిటీకి అనుగుణంగా మరికొన్ని జిల్లాలను లెవెల్‌ 3, లెవెల్ 4గా వర్గీకరించారు. ఇక లెవెల్‌ 5లో ఉన్న జిల్లాల్లో మాత్రం లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా కొనసాగిస్తామని మహారాష్ట్ర మంత్రి విజయ్‌ వాడ్డెట్టివార్‌ స్పష్టం చేశారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ఇలాంటి జిల్లాలను రెడ్జోన్‌గా పేర్కొన్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని