Mamata: సోదరుడితో అన్ని బంధాలు తెంచుకున్నా : మమతా బెనర్జీ

తన సోదరుడు బాబుల్‌తో అన్ని బంధాలను తెంచుకొన్నట్లు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Published : 13 Mar 2024 16:19 IST

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై అసహనం వ్యక్తంచేస్తూ మాట్లాడిన బాబుల్‌ బెనర్జీపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అతనితో అన్ని బంధాలను తెంచుకున్నట్లు తెలిపారు. దీదీకి సోదరుడైన బాబుల్‌.. భాజపాతో సన్నిహితంగా ఉన్నట్లు టీఎంసీ భావిస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ముందు సీఏఏను తీసుకురావడమనేది ఓ రాజకీయ జిమ్మిక్కు అని మమతా బెనర్జీ విమర్శించారు.

‘‘నా కుటుంబం, నేను.. అతడితో అన్ని బంధాలను తెంచుకున్నాం. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఏదో సమస్య సృష్టిస్తారు. అత్యాశపరులు నాకు ఇష్టముండదు. కుటుంబ రాజకీయాలను విశ్వసించను. ఆయన చేసిన వ్యాఖ్యలను విన్నా. భాజపాతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఆయనకు నచ్చినట్లు చేసుకోనివ్వండి. బాబుల్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని సోదరుడిని ఉద్దేశిస్తూ మమత వ్యాఖ్యానించారు. హావ్‌డా లోక్‌సభ స్థానాన్ని ప్రసూన్‌ బెనర్జీకి తిరిగి కేటాయించడంపై బాబుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆయన టీఎంసీలోనే కొనసాగుతున్నారు.

సీఏఏను అందుకే వ్యతిరేకిస్తున్నాం

పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) జాతీయ పౌర పట్టికతో ముడిపడి ఉందని మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు. అందుకే తాము ఈ చట్టాన్ని  వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అస్సాం మాదిరిగా పశ్చిమబెంగాల్‌లో శరణార్థి శిబిరాలను కోరుకోవడం లేదన్నారు. అయితే, సీఏఏపై పలు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోన్న వేళ కేంద్ర హోంశాఖ స్పందించింది. చట్టం అమలుపై భారత్‌లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని పేర్కొంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకువచ్చిన కేంద్రం.. ఇందుకు సంబంధించి మార్చి 11న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని