BSF: ఆగ్రహంతో ఊగిపోతూ బీఎస్‌ఎఫ్‌ జవాన్లపైకి దూసుకెళ్లిన అగంతకుడు.. కాల్పుల్లో హతం

భారత్‌-పాక్‌ (India-Pakistan) సరిహద్దులో ఓ అగంతకుడు ఆగ్రహంతో ఊగిపోతూ బీఎస్‌ఎఫ్‌ (Border Security Force) జవాన్ల దిశగా దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆత్మరక్షణ నిమిత్తం అతడిపై కాల్పులు జరిపారు. 

Published : 04 Aug 2023 16:49 IST

అమృత్‌సర్‌: భారత్‌-పాకిస్థాన్‌ (India-Pakistan) సరిహద్దులో గస్తీ విధులు నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ (Border Security Force) జవాన్లపైకి ఓ అగంతకుడు దూసుకెళ్లాడు. అక్కడే ఆగిపొమ్మని వారు హెచ్చరించినా వినలేదు. దాంతో కాల్పులు జరిపి అతడిని హతమార్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌ రాష్ట్రం తరణ్‌ తారణ్‌ జిల్లాలోని భికివింద్‌-కల్రా గ్రామం వద్దనున్న సరిహద్దులో గస్తీ కాస్తున్న జవాన్లకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ అగంతకుడు కనిపించాడు. అతడు ఆగ్రహంతో ఊగిపోతూ జవాన్ల వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో భద్రతా బలగాలు ఆ వ్యక్తిని ముందుకు రావొద్దని హెచ్చరించాయి. అయినా వినిపించుకోకపోవడంతో కాల్పులు జరిపి అతణ్ని హతమార్చాయి.

హిజ్బుల్‌ కమాండర్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు

బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది పదే పదే హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని సీనియర్‌ అధికారులు వివరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సిబ్బంది ఆత్మరక్షణ కోసం ఫైరింగ్‌ చేశారన్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దు కంచె వరకు అతడు ఎందుకు వచ్చాడనే విషయంపై విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనతో బీఎస్‌ఎఫ్‌ అప్రమత్తమైంది. భారత్-పాక్‌ సరిహద్దులోని సున్నిత ప్రాంతాల్లో గస్తీ మరింత పెంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని