Manipur: మణిపుర్‌ హింసలో విదేశీ హస్తం: సీఎం బీరేన్‌ సింగ్‌

మణిపుర్‌లో ఉద్రిక్తతల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అనుమానం వ్యక్తం చేశారు. 

Published : 02 Jul 2023 10:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌(Manipur)లో దాదాపు రెండు నెలల నుంచి చోటు చేసుకొంటున్న హింసలో విదేశీ శక్తుల హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ (CM N Biren Singh) అనుమానం వ్యక్తం చేశారు. ఈ హింస మొత్తం ముందస్తు ప్రణాళికతో పక్కాగా అమలు చేసి ఉంటారని ఆరోపించారు. ఆయన ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ మేరకు అనుమానం వ్యక్తం చేశారు.

‘‘మయన్మార్‌తో మణిపుర్‌ సరిహద్దులు పంచుకొంటోంది. చైనా కూడా కేవలం 398 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ సరిహద్దులు పూర్తిగా తెరిచే ఉంటున్నాయి. పహారా కూడా తక్కువే. వాస్తవానికి భద్రతా దళాలు అక్కడ ఉన్నా.. అంత సువిశాల ప్రదేశాన్ని పర్యవేక్షించడం సాధ్యంకాదు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణల్లో ఏ విషయాన్నీ కొట్టిపారేయలేము.. అలాగని ఆమోదించలేము.. వీటిని చూస్తుంటే ముందస్తు ప్రణాళికలతో జరుగుతున్నట్లు అనిపిస్తోంది. వీటికి కారణం మాత్రం తెలియడంలేదు. ఇప్పటికే నా కుకీ సోదర సోదరీమణులతో ఫోన్‌లో మాట్లాడాను. జరిగిన దానికి క్షమించి.. వదిలేయాలని కోరాను’’ అని బీరేన్‌ సింగ్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాజకీయ అజెండాతోనే రాష్ట్రంలో పర్యటిస్తున్నారని బీరేన్‌ సింగ్‌ ఆరోపించారు. 

జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్న విషయం తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితులకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ (CM N Biren Singh) రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ నిర్ణయాన్ని మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను రాజీనామా చేయడం లేదని బీరేన్‌ సింగ్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ముగ్గురు మైతేయ్‌ల కాల్చివేత..

మణిపుర్‌లో హింస ఏమాత్రం ఆగడం లేదు. అర్ధరాత్రి జరిగిన హింసలో మైతేయ్‌ వర్గానికి చెందిన ముగ్గురిని కుకీ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ ఘటన కుజూమా ఆదివాసీ గ్రామంలో చోటు చేసుకొంది. ఈ గ్రామం కుంబీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకొంటున్నాయి. మృతదేహాలను ఇంఫాల్‌ తీసుకొచ్చి ఆందోళన చేయాలని బాధితులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మైతేయ్‌లు డుంప్‌కీ కుకీ గ్రామాన్ని దహనం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని