వర్షాకాల సమావేశాలకు వారంతా డుమ్మాయేనా?

వైపు దేశ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు ఈ నెల 14 నుంచి వర్షాకాల సమావేశాల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరం పాటించేలా సభ్యులకు స్థానాలు కేటాయిస్తున్నారు. సభ్యులకు 3 రోజుల ముందే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎక్కడికక్కడ శానిటైజర్లు...

Published : 11 Sep 2020 13:50 IST

దిల్లీ: ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు ఈ నెల 14 నుంచి వర్షాకాల సమావేశాల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరం పాటించేలా సభ్యులకు స్థానాలు కేటాయిస్తున్నారు. సభ్యులకు 3 రోజుల ముందే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎక్కడికక్కడ శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమావేశాలకు చాలా మంది ఎంపీలు గైర్హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉభయసభల్లో కలిసి మొత్తం 785 మంది సభ్యులకు గానూ 200 మంది 65 సంవత్సరాలకు పైబడిన వారే. ఇప్పటివరకు ఏడుగురు కేంద్ర మంత్రులు, 24 మంది ఎంపీలు కరోనా బారినపడ్డారు. కొందరికి నయం కాగా.. మరికొందరు వైరస్‌ నుంచి కోలుకుంటున్నారు. వారంతా సమావేశాలకు హాజరవుతారని కచ్చితంగా చెప్పలేం. మరోవైపు కరోనా మహమ్మారి బారినపడి కన్యాకుమారి పార్లమెంట్‌ సభ్యుడు, కాంగ్రెస్‌ నేత వసంత్‌కుమార్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ జరుగుతున్న రోజుల్లో అక్కడి సిబ్బంది, భద్రతాధికారులు, ఇతరులతో కలిసి దాదాపు 2,000 మంది విధుల్లో ఉంటారు. వారిలో ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా.. మిగతావారికీ వ్యాపించే అవకాశముంది. అంతేకాకుండా వారంతా 17 రోజుల పాటు కలిసి పని చేయాలి. ఈ నేపథ్యంలో వయస్సు ఎక్కువగా ఉన్న ఎంపీలంతా సమావేశానికి హాజరయ్యేందుకు విముఖ చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 240 మంది రాజ్యసభ ఎంపీల్లో 97 మంది 65 ఏళ్ల పైబడిన వారే. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏకే ఆంటోనీ లాంటి మరో 20 మంది సీనియర్‌ నేతల వయస్సు 80 ఏళ్లకు పైబడే ఉంది. సెప్టెంబర్‌ 8న రాజ్యసభ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టిన సమాచారం మేరకు ఎగువసభ సభ్యలు సరాసరి వయస్సు 63.3 ఏళ్లు. లోక్‌సభలో 130 మందికి 65 సంవత్సరాలుండగా, 30 మందికి 75 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సుంది. మరో ఎంపీకి 90 ఏళ్లు ఉండటం గమనార్హం. ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ వీరంతా సమావేశాలకు దూరంగా ఉండాలనే భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వయస్సు మళ్లిన వారిలో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండటం కూడా ఓ కారణం కావొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని