Udhayanidhi: దృష్టి మరల్చేందుకే ‘సనాతన రగడ’.. కేసులన్నీ చట్టపరంగా ఎదుర్కొంటా: ఉదయనిధి

Udhayanidhi: భాజపా కేవలం బురదజల్లే ప్రయత్నాల్లో మాత్రమే ఉందని ఉదయనిధి అన్నారు. తమిళనాడులో డీఎంకే తరహాలో.. కేంద్రంలో భాజపా ఒక్క ప్రగతిశీల పథకమైనా ప్రవేశపెట్టిందా? అని ప్రశ్నించారు.

Published : 07 Sep 2023 13:00 IST

చెన్నై: ‘సనాతన ధర్మం (Sanatan Dharma)’పై తాను చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరిస్తోందని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) అన్నారు. ఈ విషయంలో తనపై నమోదైన అన్ని కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. భాజపా (BJP) శ్రేణుల నుంచి తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆయన స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ (Modi)ని ఉదయనిధి విమర్శించారు. ఆయనను ‘ప్రపంచ యాత్రికుడు’ అంటూ ఎద్దేవా చేశారు. మణిపుర్‌లో జరుగుతున్న హింసపై ప్రశ్నలను ఎదుర్కోవడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘గత తొమ్మిదేళ్లుగా మీరు (భాజపా) ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ప్రజా సంక్షేమానికి మీరు ఏం చేశారన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురవుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే భాజపా నేతలు నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు. దీన్ని వారు తమని తాము రక్షించుకోవడానికి ఆయుధంగా వాడుకొంటున్నారు’’ అని ఉదయనిధి (Udhayanidhi Stalin) అన్నారు.

‘‘గౌరవప్రదమైన పదవుల్లో ఉండి ఇలా అపవాదులు మోపుతున్నందుకు నేనే మీపై కేసులు పెట్టాలి. కానీ, మీ మనుగడ కొనసాగడానికి ఇదే ఆధారమని నాకు తెలుసు. బతుకుదెరువుకు మీకు మరో మార్గం తెలియదు. అందుకే మీపై కేసులు పెట్టొద్దని నిర్ణయించుకున్నా. మేం డీఎంకే వ్యవస్థాపకుడు, ద్రవిడ దిగ్గజం అన్నాదురై రాజకీయ వారసులం. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదని అందరికీ తెలుసు’’ అని ఉదయనిధి అన్నారు. ‘‘ఏ మతమైనా ప్రజలను సమానత్వం వైపు నడిపిస్తూ.. సౌభ్రాతృత్వాన్ని బోధించినట్లైతే.. నేనూ ఆధ్యాత్మికవాదినే. ఒకవేళ ఏదైనా మతం కులాల పేరిట ప్రజలను విభజిస్తూ.. అంటరానితనం, బానిసత్వాన్ని బోధిస్తే.. అలాంటి మతాన్ని వ్యతిరేకించే వారిలో నేను ముందుంటాను’’ అని గతంలో అన్నాదురై అన్నట్లు ఉదయనిధి ఈ సందర్భంగా తెలిపారు. అందరూ సమానత్వంతో జన్మించారని బోధించే అన్ని మతాలను డీఎంకే గౌరవిస్తుందని పేర్కొన్నారు.

భాజపా వీటిని అర్థం చేసుకోకుండా.. కేవలం బురదజల్లే ప్రయత్నాల్లో మాత్రమే ఉందని ఉదయనిధి అన్నారు. మోదీ, ఆయన బృందం పూర్తిగా ఈ కార్యక్రమాల్లోనే నిమగ్నమైందని విమర్శించారు. తమిళనాడులో డీఎంకే తరహాలో.. కేంద్రంలో భాజపా ఒక్క ప్రగితిశీల పథకమైనా ప్రవేశపెట్టిందా? అని ప్రశ్నించారు. మణిపుర్‌ హింస వంటి అంశాల నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ, ఆయన బృందం.. తన వ్యాఖ్యల్ని ఆయుధంగా మలుచుకుంటోందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని