Bihar Survey: 94లక్షల కుటుంబాల ఆదాయం నెలకు రూ.6వేలు మాత్రమే!

దాదాపు 50 లక్షలకుపైగా బిహారీలు ఉపాధి, విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Published : 07 Nov 2023 20:48 IST

పట్నా: బిహార్‌లోని మూడోవంతు కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.6వేలు అంతకంటే తక్కువేనని తాజా నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో 42 శాతం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా దాదాపు 50 లక్షలకుపైగా బిహారీలు ఉపాధి, విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు పేర్కొంది. కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్‌ ప్రభుత్వం అక్కడి అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

బిహార్ శాసనసభ వ్యవహారాల మంత్రి విజయ్‌ కుమార్‌ చౌధరి అక్కడి అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టారు. ‘రాష్ట్రంలో దాదాపు 2.97 కోట్ల కుటుంబాలు ఉండగా.. అందులో 94 లక్షలకుపైగా (34.13శాతం) పేదరికంలోనే ఉన్నాయి. ఈ 34 శాతం కుటుంబాల ఆదాయం నెలకు రూ.6వేల లోపే ఉంది. 29.6 శాతం రూ.10 వేలు అంతకంటే తక్కువ సంపాదిస్తు్న్నాయి. దాదాపు 28 శాతం కుటుంబాల ఆదాయం రూ.10 వేల నుంచి 50 వేల వరకు ఉండగా.. కేవలం 4 శాతం కంటే తక్కువ కుటుంబాల ఆదాయం రూ.50వేలకు పైగా ఉంది’ అని నివేదికలో వెల్లడైంది.

డేట్‌, టైం చెప్పండి.. సోఫా ఫొటో షేర్‌ చేసి, అమిత్‌ షాకు బఘేల్‌ కౌంటర్‌

రాష్ట్రానికి చెందిన దాదాపు 50 లక్షల మంది ఉపాధి, ఉన్నత విద్యాభ్యాసం కోసం పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లారని పేర్కొంది. వీరిలో సుమారు 46 లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో ఉండగా.. మరో 2.17 లక్షల మంది విదేశాల్లో ఉన్నట్లు తెలిపింది. విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారి సంఖ్య 5.52 లక్షలుగా ఉండగా.. 27 వేల మంది విదేశాల్లో చదువుతున్నారని వెల్లడించింది. వెనకబడిన తరగతులు, దళితులు, గిరిజనుల్లో పేదరికం అత్యధికంగా ఉన్నప్పటికీ.. అగ్రవర్ణాల్లోనూ పేదరికం ఉందని తాజా నివేదిక పేర్కొంది.

ఇదిలాఉంటే, బిహార్‌లో కులగణన చేపట్టాలని నిర్ణయించిన నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం.. ఇటీవలే దీన్ని పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అక్టోబర్‌ 2న విడుదల చేయగా.. ఆర్థిక, విద్యకు సంబంధించి అంశాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతమున్న 50శాతం రిజర్వేషన్‌ కోటాను 65శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ఆర్థికంగా వెనకబడిన వారితో కలిపి ఇవి 75శాతానికి చేరనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని