NCERT: పదో తరగతి సిలబస్‌లో మరికొన్ని పాఠాలకు కత్తెర

గత కొంత కాలంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తున్న ఎన్‌సీఈఆర్‌టీ (NCERT), తాజాగా 10వ తరగతి సిలబస్‌లో ముఖ్యమైన పాఠాలను తొలగించింది. విద్యార్థులపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Published : 01 Jun 2023 20:18 IST

దిల్లీ: కొద్దిరోజుల క్రితం 9, 10, 11, 12 తరగతులకు సంబంధించిన సిలబస్‌లో కొన్ని పాఠ్యాంశాలను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) తొలగించింది. తాజాగా, 10వ తరగతి సిలబస్‌లో మరికొన్ని పాఠ్యాంశాలను తొలగించినట్లు తెలిపింది. సైన్స్ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌, ఇంధన మూలకాలు, సహజ వనరుల నిర్వహణ, డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌-1 నుంచి ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు పాఠాలు తొలగించిన వాటిలో ఉన్నాయి. ఇకపై ఎన్‌సీఈఆర్‌టీ 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ పాఠాలను చదవాల్సిన అవసరంలేదు. విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. 

కరోనా సమయంలో విద్యార్థులపై భారం పడకుండా ఈ పాఠ్యాంశాలను ఎన్‌సీఈఆర్‌టీ తాత్కాలికంగా తొలగించింది. తాజాగా ముద్రించిన కొత్త పుస్తకాల్లో వాటిని శాశ్వతంగా తొలగించింది. భారత్‌లో సైన్స్ తప్పనిసరి పాఠ్యాంశంగా 10వ తరగతి వరకు మాత్రమే బోధిస్తారు. ఆ తర్వాత సైన్స్ గ్రూప్‌ చదివే విద్యార్థులకు మాత్రమే తొలగించిన పాఠ్యాంశాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో, ఎంతో ముఖ్యమైన పిరియాడిక్‌ టేబుల్‌ వంటి పాఠ్యాంశాలను పదో తరగతి సైన్స్ పుస్తకాల తొలగించడంపై విద్యారంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

 దీనిపై ఎన్‌సీఈఆర్‌టీ వివరణ ఇచ్చింది. ఇది, ఈ విద్యాసంవత్సరం జరిగిన సిలబస్‌ మార్పు కాదని.. గతేడాది జూన్‌లోనే సిలబస్‌ హేతుబద్ధీకరణ జరిగినట్లు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ సక్లానీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని