Arvind Kejriwal: జైల్లో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్‌

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్‌ అందజేసినట్లు ఆప్‌ ప్రకటించింది. 

Updated : 23 Apr 2024 11:19 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi excise scam case)లో అరెస్టయిన ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. సోమవారం రాత్రి ఆయన రక్తంలో చక్కెర స్థాయులు 320కి చేరడంతో వైద్యులు ఇన్సులిన్ ఇచ్చారు.

కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వకుండా, తన వైద్యుడితో సంప్రదింపులకు అవకాశం కల్పించకుండా కావాలనే ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కొద్దిరోజులుగా ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. మరోపక్క ఆయనకు మధుమేహ వ్యాధికి ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాత్రి ఆయనకు దానిని అందజేశారు. ‘‘ముఖ్యమంత్రి చెప్పిన మాట నిజమేనని, ఆయనకు ఇన్సులిన్ అవసరమని నేడు స్పష్టమైంది. కానీ, భాజపా ప్రభుత్వం కింద పనిచేస్తున్న కొందరు అధికారులు ఆయనకు ఉద్దేశపూర్వకంగా వైద్యసేవల్ని దూరం చేస్తున్నారు. ఇన్సులిన్ అవసరం లేకపోతే మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు..? ప్రపంచం మొత్తం వారిని శపిస్తుండటమే అందుకు కారణం’’ అని దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్ వెల్లడించారు. 

ఎయిమ్స్‌ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు ఇన్సులిన్‌ విషయాన్ని కేజ్రీవాల్‌ లేవనెత్తలేదని, వైద్యులు కూడా సూచించలేదని ఇదివరకు జైలు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై దిల్లీ సీఎం స్పందిస్తూ.. రాజకీయ ఒత్తిళ్లతో వారు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. జైలులో తనకు ఇన్సులిన్‌ ఇచ్చేందుకు అనుమతించకపోవడంతో తన షుగర్‌ స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తన భార్య సమక్షంలో వైద్యుడితో సంప్రదించేందుకు వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ)లో అవకాశం ఇవ్వాలన్న ఆయన వినతిని తోసిపుచ్చిన దిల్లీ కోర్టు.. మెడికల్‌ బోర్డు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని