Nitish Kumar: సచివాలయానికి వెళ్లిన సీఎం నీతీశ్‌కు షాక్‌!

అకస్మాత్తుగా రాష్ట్ర సచివాలయ సందర్శనకు వెళ్లిన బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఉదయం 9.30 దాటినా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు విధులకు హాజరు కాలేదు. 

Published : 26 Sep 2023 19:53 IST

పట్నా: బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌కు (Nitish Kumar) ఊహించని షాక్‌ తగిలింది. మంత్రులు, వివిధ ఉన్నతాధికారుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఆయన రాష్ట్ర సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆయన వెళ్లిన సమయానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు విధులకు హాజరు కాలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల్లోగా అందరు మంత్రులు, అధికారులు కచ్చితంగా సచివాలయంలో ఉండాలని మౌకిక ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తొలుత నూతన సచివాలయం వికాశ్‌భవన్‌కు వెళ్లారు. లోపలికి వెళ్లి చూస్తే.. చాలా మంత్రుల కేబిన్‌లు ఖాళీగా దర్శనమిచ్చాయి. విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌, చక్కెర పరిశ్రమ శాఖ మంత్రి అలోక్‌ కుమార్‌, పరిశ్రమల శాఖ మంత్రి సమీర్‌ కుమార్‌, రవాణాశాఖ మంత్రి షీలా కుమారి, వ్యవసాయ శాఖ మంత్రి కుమార్‌ సర్వజీత్‌ తదితర మంత్రులు సీఎం వెళ్లేసరికి సచివాలయానికి రాలేదు. దీనిపై సీఎం తీవ్ర విస్మయం వ్యక్తం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కొందరు మంత్రులకు సీఎం అక్కడి నుంచే ఫోన్‌ చేసి ఎందుకు రాలేదని ప్రశ్నించినట్లు తెలిపారు. అక్కడి నుంచి నీతీశ్‌ సాంకేతిక సచివాలయం విశ్వేశ్వరాయ భవన్‌కు వెళ్లారు. అక్కడి ఉన్నతాధికారులు గైర్హాజరవ్వడాన్ని గమనించారు. ఉదయం 9.30 గంటల్లోగా కచ్చితంగా విధులకు హాజరుకావాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని