పెగాసస్‌ వ్యవహారం.. NSO గ్రూప్‌పై నిషేధ ప్రతిపాదన లేదు: కేంద్రం

పెగాసస్‌ స్పైవేర్‌ దుమారానికి కారణమైన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌పై దేశంలో నిషేధం విధించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది.

Published : 04 Dec 2021 20:25 IST

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ దుమారానికి కారణమైన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌పై దేశంలో నిషేధం విధించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది. అలాగే, అమెరికాలో దీనిపై నిషేధం విధించారన్న విషయం తమకు తెలీదని పేర్కొంది. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకుల ఫోన్లపై నిఘా కోసం పెగాసస్‌ స్పైవేర్‌ వినియోగించారంటూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌కు రూపొందించింది.

‘‘ఈ గ్రూప్‌ను అమెరికాలో నిషేధించారని కేంద్రానికి తెలుసా? తెలిస్తే ఆ వివరాలివ్వండి. భారత్‌లో సైతం దీనిపై నిషేధం విధించే ప్రతిపాదన ఉందా? ఉంటే ఆ వివరాలు తెలుపగలరు’’ అంటూ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నించారు. దీనికి  కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ సమాధానం ఇచ్చారు. అమెరికాలో నిషేధానికి సంబంధించిన సమాచారం లేదని, నిషేధం విధించే ప్రతిపాదనేదీ లేదని ఆయన స్పష్టంచేశారు. అనుమానిత సైబర్‌ చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం మేరకు ఇజ్రాయెల్‌కు చెందిన రెండు స్పైవేర్‌ సంస్థలను ఈ నవంబర్‌లో యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ బ్లాక్‌లిస్టులో పెట్టింది. అందులో ఎన్‌ఎస్‌వో ఒకటి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని