Updated : 18 Feb 2021 12:39 IST

ఆ రోజు చైనాతో యుద్ధం జరిగేదే..

కీలక శిఖరాల స్వాధీన ఘటనను గుర్తుచేసుకున్న లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ జోషీ

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో భారత్‌, చైనా మధ్య తొమ్మిది నెలల పాటు ఏర్పడిన ప్రతిష్టంభన నెమ్మదిగా తొలగుతోంది. ఇరువైపులా బలగాల ఉపసంహరణ వేగంగా సాగుతోంది. అయితే, ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఒకానొక దశలో చైనాతో యుద్ధం అంచుల వరకు భారత్‌ వెళ్లిందని ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ వైకే జోషీ తెలిపారు. అయితే, యుద్ధానికి దారితీయకుండా భారత్‌ చాకచక్యంగా చైనాను నిలువరించిందని వెల్లడించారు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరు దేశాల సరిహద్దుల్లో గతేడాది ఆగస్టులో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను వివరించారు. 

‘‘జులైలో గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగిన తర్వాత ఇరుదేశాల మధ్య ఎర్రగీత గీయాల్సి వచ్చింది. ఆగస్టు 29, 30 మధ్యరాత్రి భారత్‌ పాంగాంగ్‌ సరస్సుకు దక్షిణాన  వ్యూహాత్మకంగా కీలకమైన కైలాశ్‌ రేంజ్‌ను అధీనంలోకి తీసుకుంది. ఈ ఆకస్మిక చర్యతో చైనా కంగుతింది. అయితే ప్రతిచర్యకు దిగింది. ఆగస్టు 31న కైలాశ్‌ రేంజ్‌ సమీపంలోకి రావాలని ప్రయత్నించింది. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. మా ట్యాంకు మన్‌‌, గన్నర్ సహా‌ అందరూ పరిస్థితులను గమనిస్తున్నారు. శత్రవుల యుద్ధ ట్యాంక్‌ అత్యంత సమీపంగా రావడంతో వారంతా అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో ట్రిగ్గర్‌ నొక్కి యుద్ధం ప్రారంభించడం చాలా సులువే. ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి ఆపరేషన్లయినా చేపట్టేందుకు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కానీ, చైనా దళాలపై కాల్పులు జరపకుండానే ఎదుర్కోవడం చాలా సహనంతో కూడిన క్లిష్టమైన పని. దానికి చాలా ధైర్యం, నిబద్ధత కావాలి. మన జవాన్లు అలానే వ్యవహరించారు. యుద్ధం జోలికి వెళ్లకుండా చైనాను నిలువరించగలిగాం. కానీ, ఆ సమయంలో భారత్‌ దాదాపు యుద్ధం అంచుల వరకు వెళ్లింది’’ అని వైకే జోషీ చెప్పుకొచ్చారు. 

చైనా వైపు 45 మంది మృతి!

ఈ సందర్భంగా గల్వాన్‌ లోయలో ఘర్షణల గురించి కూడా జోషీ ప్రస్తావించారు. ఆ ఘర్షణల్లో చైనా వైపు చాలా మందే సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారన్నారు. అయితే, ఎంతమంది అనేది మనం అధికారికంగా చెప్పలేమని అన్నారు. కాగా.. ఇటీవల రష్యా ఏజెన్సీ టాస్‌ మాత్రం 45 మంది చైనా జవాన్లు మరణించినట్లు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. 45 లేదా అంతకంటే ఎక్కువ మందే మృతిచెంది ఉండొచ్చని అంచనావేశారు. 

చైనాకు మిగిలింది చెడ్డపేరు మాత్రమే..

సరిహద్దుల్లో రెచ్చగొట్టి కయ్యానికి కాలు దువ్విన డ్రాగన్‌కు ఈ ప్రతిష్టంభనతో చెడ్డ పేరు తప్ప ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. భారత్‌ ఆకస్మిక చర్యలు చైనాను గందరగోళానికి గురిచేశాయని, నియంత్రణ రేఖ వద్ద ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయిందని చెప్పారు. సరిహద్దుల్లో యథాతథస్థితిని మార్చేందుకు భారత్‌ ఎప్పటికీ అంగీకరించబోదని డ్రాగన్‌కు బాగా అర్థమైందన్నారు. అందుకే మళ్లీ ఎటువంటి దుశ్చర్యకు పాల్పడలేదని చెప్పారు. బలగాల ఉపసంహరణతో భారత్‌ ఏమీ కోల్పోలేదని, ఈ పది నెలల్లో భారత జవాన్లు చూపిన ధైర్యసహసాలు, సహనానికి యావత్ దేశం గర్వపడుతుందని కొనియాడారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని