Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. సిగ్నల్‌ వైఫల్యం వల్ల కాకపోవచ్చు..!

Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటనకు సిగ్నలింగ్ వైఫల్యం కాకపోవచ్చని రైల్వేశాఖ సీనియర్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నలే ఇచ్చారని, అయినా అది లూప్‌లైన్‌లోకి వెళ్లిందని ఆయన తెలిపారు.

Updated : 07 Jun 2023 10:30 IST

భువనేశ్వర్‌: యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు దుర్ఘటన (Odisha Train Tragedy)కు గల కారణాలు ఏంటనేది తెలియరావట్లేదు. సిగ్నలింగ్‌ వ్యవస్థలో వైఫల్యం  (signal failure) కారణంగానే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే శాఖ ‘సంయుక్త దర్యాప్తు నివేదిక’ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ దర్యాప్తు బృందంలో ఒకరైన ఓ సీనియర్‌ రైల్వే ఇంజినీర్‌.. ఈ నివేదికను వ్యతిరేకించినట్లు తాజాగా తెలిసింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Coromandal Express) మెయిన్‌లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, అయినప్పటికీ అది లూప్‌లైన్‌లోకి వెళ్లిందని ఆ ఇంజినీర్‌ తెలిపారు. దీనికి సంబంధించిర ‘డేటాలాగర్‌’ రిపోర్ట్‌ను ఆయన ప్రస్తావించారు.

ప్రమాదం తర్వాత ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేసేందుకు రైల్వేశాఖ ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించిన అనంతరం వీరు ప్రాథమిక నివేదికను బయటపెట్టారు. ‘‘మెయిన్‌లైన్‌లో నుంచి లూప్‌లైన్‌లోకి వెళ్లేందుకు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌కు సిగ్నల్‌ ఇచ్చారు. బహానగా బజార్‌ స్టేషన్‌కు చెందిన పాయింట్‌ నం.17ఏ ‘రివర్స్‌’ కండిషన్‌లో ఉంది. ఈ పాయింట్ ‘రివర్స్‌’లో ఉందంటే.. దాని అర్థం లూప్‌లైన్‌లోకి వెళ్లాలని..! అదే ఈ పాయింట్‌ ‘నార్మల్‌’లో ఉంటే.. రైలు మెయిన్‌లైన్‌ మీదుగానే వెళ్తుంది. దీంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లూప్‌లైన్‌లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొంది’’ అని ఈ ప్యానెల్‌లోని నలుగురు సభ్యులు నివేదికలో పేర్కొన్నారు.

సిగ్నల్‌ నార్మల్‌గానే..

ఈ ప్యానెల్‌లోని ఐదో వ్యక్తి అయిన సిగ్నల్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ ఏకే మహంత మాత్రం మిగిలిన నలుగురి అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ‘‘పాయింట్‌ నం. 17ఏను రివర్స్‌ కండిషన్‌లో సెట్‌ చేసి ఉందంటే నేను అంగీకరించను. డేటాలాగర్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ఈ పాయింట్‌ ‘నార్మల్‌’లోనే ఉందని మా విభాగం పరిశీలనలో తేలింది. రైలు పట్టాలు తప్పిన తర్వాత ఈ పాయింట్‌ ‘రివర్స్‌’లోకి మారిపోయి ఉంటుంది’ అని మహంత నివేదికలో అభిప్రాయపడ్డారు. రైల్వేల్లో ‘డేటాలాగర్‌’ అనేది మైక్రోప్రాసెసర్‌ ఆధారిత వ్యవస్థ. ఇది రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థను మానిటర్‌ చేసి, డేటాను భద్రపరుస్తుంది.

అయితే, తొలుత మహంత కూడా సిగ్నలింగ్‌ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ప్యానెల్‌లోని మిగతా సభ్యుల వాదనను అంగీకరించారట. ఆ తర్వాత అకస్మాత్తుగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ నివేదికపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మహంత వ్యాఖ్యలపై రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు స్పందించారు. ‘‘ప్రాథమిక దర్యాప్తు సమయంలో విభిన్న విభాగాల ప్రతినిధుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఇది సాధారణమే. అయితే, రైల్వే భద్రత కమిషనర్ దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు బయటపడతాయి’’ అని ఆ అధికారులు పేర్కొన్నారు.

బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద షాలీమార్‌-చెన్నై కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మెయిన్‌లైన్‌లోకి వెళ్లడానికి సిబ్బంది గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, ఎందువల్లనో వెంటనే వెనక్కి తీసుకున్నారని రైల్వే ప్రాథమిక నివేదికలో తేలింది. దీంతో ఆ రైలు లూప్‌లైన్లోకి వెళ్లి అప్పటికే అక్కడ ఆగి ఉన్న గూడ్సురైలును ఢీకొట్టింది. ఆ తీవ్రతకు కోరమాండల్‌లోని కొన్ని బోగీలు ఎగిరి, పక్కనున్న ట్రాకుపై పడ్డాయి. అదే సమయంలో ఆ మార్గంలో దూసుకువస్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు వాటిని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో పెను విషాదం చోటుచేసుకుంది. అయితే ఈ సిగ్నల్‌ను వెనక్కు తీసుకోవడం వెనుక ఉద్దేశపూర్వక చర్య ఏదైనా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీన్ని నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని