Metro Services: ‘2022 నాటికి దేశవ్యాప్తంగా 900 కి.మీల మేర మెట్రో లైన్లు’

దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో మెరుగైన ప్రజారవాణా ప్రధాన పాత్ర పోషిస్తుందని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆధునిక, వేగవంత రవాణా సౌకర్యానికి వీలుగా దేశవ్యాప్తంగా...

Published : 18 Sep 2021 18:25 IST

దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో మెరుగైన ప్రజారవాణా ప్రధాన పాత్ర పోషిస్తుందని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆధునిక, వేగవంత రవాణా సౌకర్యానికి వీలుగా దేశవ్యాప్తంగా మెట్రో లైన్ల విస్తరణ పనులను ముమ్మరం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా నగరాల్లో 740 కి.మీ మేర మెట్రో లైన్లు అందుబాటులో ఉన్నాయని, 2022 నాటికి 900 కి.మీలకు పైగా చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. దిల్లీ మెట్రోలో భాగంగా కొత్తగా నిర్మించిన నజఫ్‌గఢ్‌- ఢాన్సా బస్టాండ్‌ మెట్రో సెక్షన్‌ను శనివారం ఆయన ఆన్‌లైన్‌ వేదికగా ప్రారంభించి మాట్లాడారు. 

రోజుకు 85 లక్షల ప్రయాణికులు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 85 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సర్వీసుల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. మెట్రో వ్యవస్థ.. పట్టణీకరణ రూపాన్నే మార్చిందన్నారు. దేశంలోని వివిధ నగరాల్లో మరో వెయ్యి కిలోమీటర్ల మేర మెట్రో లైన్లు నిర్మాణంలో ఉన్నాయని, కొన్నేళ్లలో మొత్తం 2,000 కి.మీ మేర అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ పనులను వేగంగా పూర్తి చేసిన దిల్లీ మెట్రో సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మెట్రో వంటి ఆధునిక రవాణా వ్యవస్థతో దేశ రాజధాని దిల్లీ.. లండన్, న్యూయార్క్ వంటి ప్రపంచస్థాయి నగరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని