Survey: పిల్లలకు ఆన్‌లైన్‌, వర్చువల్‌ బోధన తగ్గించాల్సిందే..!

పిల్లల మానసిక స్థితిపై వీడియో గేమ్స్‌, సోషల్‌ మీడియా సానుకూల ప్రభావమే చూపిస్తోందని 40శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.

Published : 06 Jun 2022 01:51 IST

తాజా సర్వేలో తల్లిదండ్రుల అభిప్రాయాలు

దిల్లీ: ఇటీవలి కాలంలో పెరిగిన సాంకేతికత వల్ల పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వాటికి అలవాటైపోతున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా ప్రభావం అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికత పిల్లల్లో ఏవిధమైన ప్రభావాన్ని చూపిస్తుందనే విషయంపై సర్వేలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లల మానసిక స్థితిపై వీడియో గేమ్స్‌, సోషల్‌ మీడియా సానుకూల ప్రభావమే చూపిస్తోందని 40శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వల్ల ఇదే విధమైన ప్రభావం ఉన్నట్లు 30శాతం మంది తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం. అయితే పాఠశాలలు ఆన్‌లైన్‌, వర్చువల్‌ పద్ధతిలో బోధన తగ్గించాలని సర్వేలో పాల్గొన్న 80శాతం మంది తల్లిదండ్రులు పేర్కొన్నారు. 

విద్యా రంగంలో సమస్యలు, పిల్లల మానసిక స్థితిపై పియర్‌సన్‌ గ్లోబల్‌ లెర్నర్స్‌ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. అమెరికా, బ్రిటన్‌, బ్రెజిల్‌, చైనాతోపాటు భారత్‌లోని 3100 మంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందులో భాగంగా తమ పిల్లలు, ఉద్యోగులకు మానసిక ఆరోగ్యంపై పాఠశాలలు ఉచిత సేవలు అందించాలని 92శాతం మంది తల్లిదండ్రులు పేర్కొన్నారు. పిల్లలకు ప్రాథమిక పాఠశాలల్లోనే మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని 53శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను విద్యార్థులకు, తల్లిదండ్రులతో పంచుకోవాలని కేవలం 26శాతం మంది మాత్రమే చెప్పారు.

* తమ పిల్లలపై సోషల్‌ మీడియా సానుకూల ప్రభావమే చూపుతోందని 30శాతం మంది తల్లిదండ్రులు పేర్కొన్నారు.

* వర్చువల్‌ పద్ధతిలో బోధన చిన్నారులపై సానుకూల ప్రభావమే కనిపిస్తోందని 27శాతం మంది అభిప్రాయపడ్డారు.

* ఇక వీడియో గేమ్స్‌ కూడా పిల్లలపై సానుకూల ప్రభావమే చూపిస్తోందని 40శాతం మంది వివరించారు.

* పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కార్యక్రమాలు అవసరమని 88శాతం మంది పేరెంట్స్‌ పేర్కొన్నారు.

*

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని