Arpita Mukherjee: నా ఇల్లొక మినీ బ్యాంకు.. ఎంత డబ్బుందో ఏనాడు చెప్పలేదు..!

పశ్చిమ్ బెంగాల్‌లో ఉద్యోగ నిమాయకాల కుంభకోణం కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ సహా పలువురిని ఈడీ అరెస్టు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Updated : 24 Nov 2022 14:48 IST

విచారణలో అర్పిత వెల్లడించినట్లు సమాచారం

కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్‌లో ఉద్యోగ నిమాయకాల కుంభకోణం కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ సహా పలువురిని ఈడీ అరెస్టు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి తన ఇంటిని ఒక మినీ బ్యాంకులా వాడుకున్నారని, డబ్బును తన ఇంట్లోనే దాచేవారని అర్పిత వెల్లడించినట్లు సమాచారం. 

‘నా ఇంట్లోని ఒక గదిలో పార్థా ఛటర్జీ డబ్బు దాచేవారు. ఆ గదికి మంత్రి, ఆయన మనుషులకు మాత్రమే ప్రవేశం ఉంది. ప్రతి వారంపదిరోజులలొకసారి ఛటర్జీ మా ఇంటికి వచ్చేవారు. నా ఇంటిని, మరో మహిళ ఇంటిని మినీ బ్యాంకులా ఉపయోగించుకునేవారు. ఆ మహిళ కూడా ఆయనకు సన్నిహితురాలే. ఆ గదిలో ఎంత డబ్బు ఉంచారో మంత్రి ఏనాడు చెప్పలేదు’ అని అర్పిత విచారణలో వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే బెంగాలీ నటుడి ద్వారా మంత్రితో తనకు పరిచయం ఏర్పడినట్లు చెప్పారన్నాయి. బదిలీలు, కళాశాలల గుర్తింపునకు సహకరించినందుకు ప్రతిఫలంగా ఈ డబ్బు అందేదని వెల్లడించినట్లు సమాచారం. కాగా, ఈ నేరారోపణలకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అర్పిత ఇంట్లో అధికారులు ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో కీలక సమాచారం లభించొచ్చని అంచనా వేస్తున్నారు.

పార్థా ఛటర్జీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన 2014-2021 మధ్య కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి శుక్రవారం జరిపిన సోదాల్లో అర్పితా ముఖర్జీ నివాసంలో లభించిన నగదు రూ.21 కోట్లుగా ఈడీ వెల్లడించింది. ఆమె తన వద్ద అంత డబ్బు ఎందుకు ఉందో సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. కుంభకోణంతో ప్రమేయం ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది. అంతకుముందు అర్పితా ముఖర్జీ విలేకరులతో మాట్లాడుతూ.. తన నివాసంలో నగదు పట్టుబడటం భాజపా కుట్రగా ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని