PM KISAN: పీఎం కిసాన్‌.. 11వ విడత నగదు విడుదల రేపే

దేశవ్యాప్తంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పటివరకు రూ.1.80లక్షల కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు.

Published : 30 May 2022 21:42 IST

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడి

దిల్లీ: దేశవ్యాప్తంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పటివరకు రూ.1.80లక్షల కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా 11వ విడత నగదును మే 31న (మంగళవారం) ప్రధాని మోదీ విడుదల చేస్తారని అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని శిమ్లాలో జరిగే ‘గరీబ్‌ కల్యాణ్‌ సమ్మేళన్‌’ కార్యక్రమం సందర్భంగా వీటిని విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ కూడా వెల్లడించింది. ఇందులో భాగంగా 16 పథకాల లబ్ధిదారులతోనూ ప్రధాని మోదీ ఇష్టాగోష్ఠిగా మాట్లాడనున్నారు. ఇక పీఎం-కిసాన్ 10వ విడత నిధుల‌ను జ‌న‌వ‌రి 1, 2022న కేంద్ర ప్రభుత్వం విడుద‌ల చేసింది. దేశవ్యాప్తంగా 10.09కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20.900కోట్ల నగదును జమ చేశారు.

ఇదిలాఉంటే, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం కిసాన్‌) పథకం కింద దేశంలోని ప్రతి రైతుకు ఒక్కో విడత రూ.2 వేల చొప్పున 3 దఫాలుగా మొత్తం రూ.6 వేలు కేంద్రం జమచేస్తోంది. తాజాగా 11వ విడతను విడుదల చేయనుంది. అయితే, ఇటీవల నిబంధనలు కఠినతరం చేసిన ప్రభుత్వం.. అర్హులైన రైతులను గుర్తించేందుకు గాను వారి ఖాతాలకు ఆధార్‌ నమోదును తప్పనిసరి చేసింది. ఈకేవైసీని పూర్తిచేయడానికి మే 31వరకు గడువు ఇచ్చింది. పీఎమ్ కిసాన్‌కి రిజిస్టర్‌ చేసుకున్న రైతులు ఆన్‌లైన్‌లో పీఎమ్ కిసాన్ వెబ్‌సైట్ ద్వారా గానీ, ఆఫ్‌లైన్‌లో కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌ను (CSC)కి వెళ్లిగాని ఈకేవైసీ పూర్తి చేయ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని