Bharat: జీ20 సదస్సు.. మోదీ నేమ్‌ప్లేట్‌పైనా ‘భారత్‌’

G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై ‘భారత్‌’ అని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 09 Sep 2023 12:11 IST

దిల్లీ: జీ20 విందు కోసం రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంగ్‌ ఆఫ్‌ భారత్‌’ అని ముద్రించడం రాజకీయ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా.. కేంద్రం మాత్రం దేశం పేరును ‘భారత్‌ (Bharat)’గానే వ్యవహరించడాన్ని కొనసాగిస్తోంది. తాజాగా జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)లోనూ ‘భారత్‌’ పేరునే వినియోగించింది.

భారత్‌ అధ్యక్షతన రెండు రోజుల జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు శనివారం ప్రారంభమైంది. దిల్లీలోని ప్రగతి మైదాన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ‘భారత్‌ మండపం’లో ప్రపంచ నేతల చర్చలు చేపట్టారు. ఈ సదస్సును ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభిస్తూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రసంగించారు. అయితే, ఈ సమావేశంలో మోదీ కూర్చున్న స్థానం వద్ద నేమ్‌ప్లేట్‌పై మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా ‘భారత్‌’ అని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జీ20 విస్తరణ.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు సభ్యత్వం ప్రకటించిన మోదీ

అంతేకాదు, సదస్సును ప్రారంభిస్తూ.. ప్రధాని మోదీ కూడా ‘భారత్‌ మీకు స్వాగతం పలుకుతోంది’ అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు ప్రపంచ నేతల కోసం ముద్రించిన జీ20 ప్రత్యేక బుక్‌లెట్‌లోనూ ‘భారత్‌’ అని పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ‘భారత్‌’ అంశంపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరును ఆంగ్లంలోనూ ‘భారత్‌’గా స్థిరీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని