Vande Bharat Express: ఒకేరోజు పట్టాలెక్కనున్న 5 వందే భారత్‌ రైళ్లు.. రూట్‌లు ఇవే!

Vande Bharat express: దేశంలో మరో ఐదు వందేభారత్‌ రైళ్లు ఒకేరోజు పట్టాలెక్కనున్నాయి. ఆ రైళ్ల జాబితా ఇదే..

Updated : 26 Jun 2023 20:20 IST

దిల్లీ: కేంద్ర రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat express) రైళ్లకు ప్రయాణికులనుంచి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం క్రమంగా ఈ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ఇప్పటికే 17 రూట్లలో ఈ సెమీ-హైస్పీడ్‌ రైళ్లు(semi hi-speed trains) సర్వీసులు అందిస్తుండగా.. తాజాగా మరో ఐదు  వందేభారత్‌ రైళ్లను ఒకేరోజు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఐదు వందే భారత్‌ రైళ్లను మంగళవారం ఉదయం 10.30గంటలకు ప్రారంభించనున్నట్టు పీఎంవో(PMO) ఓ ప్రకటనలో వెల్లడించింది.  మొత్తం ఐదు కొత్త వందేభారత్‌ రైళ్ల(Vande Bharat rails)లో రెండు రైళ్లు మధ్యప్రదేశ్‌ నుంచి ప్రారంభం కానుండగా.. కర్ణాటక, బిహార్‌, గోవాల నుంచి మరో మూడు రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా రూట్‌లలో సర్వీసులందిస్తుండగా.. వీటితో కలిపి వందే భారత్‌ రైళ్ల సంఖ్య 24కి చేరుకోనుంది.

రూట్‌లు ఇవే.. 

  • మధ్యప్రదేశ్‌లో భోపాల్‌ నుంచి దిల్లీకి ఇప్పటికే ఒక వందే భారత్‌ రైలు సేవలందిస్తుండగా.. మంగళవారం కొత్తగా రాణి కమలాపతి-జబల్పూర్‌; ఖజురహో-భోపాల్‌-ఇండోర్‌ మధ్య రెండు రైళ్లు ప్రారంభం కానున్నాయి. రాణికమలాపతి-జబల్పూర్‌ వందే భారత్‌ రైలు మహాకౌసల్‌ ప్రాంతం (జబల్పూర్‌) నుంచి సెంట్రల్‌ రీజియన్‌ (భోపాల్‌)ను కలుపుతూ ప్రయాణికులకు సేవలందించనుంది. బెహ్రాఘాట్‌, పచ్‌మడి, సాత్పూర తదితర పర్యాటక ప్రాంతాల మీదుగా కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. గతంలో ఈ రూట్‌లో సర్వీసులందిస్తున్న రైలుతో పోలిస్తే ఈ రైలు 30నిమిషాలు ముందుగానే గమ్యస్థానాలకు చేరుకోనుంది.
  • ఖజురహో-భోపాల్‌-ఇండోర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మాల్వా (ఇండోర్‌), బుందేల్‌ ఖండ్‌ (ఖజురహో) నుంచి సెంట్రల్‌  (భోపాల్‌ను) కలుపుతూ సర్వీసులు కొనసాగించనుంది. ఈ రైలు ద్వారా మహాకాళేశ్వర్‌, మండు, మహేశ్వర్‌, ఖజురహో, పన్నా తదితర పర్యాక ప్రాంతాలకు వెళ్లే భక్తులకు సౌలభ్యం  ఉంటుంది. ఈ మార్గంలో గతంలో సర్వీసులందిస్తున్న రైళ్లతో పోలిస్తే రెండున్నర గంటల ముందుగానే గమ్యస్థానాలకు చేరుస్తుంది. 
  • మడ్‌గావ్‌- ముంబయి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గోవా రాష్ట్రానికి సంబంధించిన తొలి సెమీ హైస్పీడ్‌ రైలు. ఇది ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ నుంచి గోవాలోని మడ్‌గావ్‌ స్టేషన్ల మధ్య రాకపోకలు కొనసాగిస్తుంది. గతంలో వేగంగా ప్రయాణించే రైళ్లతో పోలిస్తే ఈ రైలు ద్వారా గంట సమయం ఆదా కానుంది. 
  • ధార్వాడ్‌- బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కర్ణాటకలోని ధార్వాడ్‌, హుబ్బళ్లి, దేవనగరి పట్టణాలను బెంగళూరుకు కలుపుతూ సర్వీసులందిస్తుంది. కర్ణాటకకు సంబంధించి ఇది రెండో వందేభారత్‌ రైలు కావడం విశేషం ఇప్పటికే చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య వందేభారత్‌ రైలు సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా ప్రారంభమయ్యే ఈ రైలుతో పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారులకు లబ్ధిచేకూరనుంది. ఈ రూట్‌లో ప్రయాణించే వేగవంతమైన రైళ్లతో పోలిస్తే దాదాపు అరగంట సమయం ఆదాకానుంది. 
  • హతియా-పట్నా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఝార్ఖండ్‌,  బిహార్‌ రాష్ట్రాలను కలుపుతూ రాకపోకలు కొనసాగిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏర్పాటయ్యే తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇదే. పట్నా, రాంచీల మధ్య కనెక్టివిటీ ఏర్పడటంతో పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారులకు వరంగా మారనుంది. ఈ మార్గంలో వందేభారత్‌ రైలు దాదాపు గంటన్నర సమయం ఆదా చేస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని