USA: మోదీ పర్యటన.. వాటిపైనే కీలక చర్చలు: శ్వేతసౌధం

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని శ్వేతసౌధం వెల్లడించింది. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని ప్రకటన విడుదల చేసింది.

Published : 08 Jun 2023 21:50 IST

వాషింగ్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పర్యటనతో భారత్‌- అమెరికా మధ్య ద్వైపాక్షికసంబంధాలు మరింత బలోపేతం అవుతాయని శ్వేతసౌధం (Whitehouse) వెల్లడించింది. ఇరుదేశాల అభివృద్ధి, సాంకేతికత, వాణిజ్యం, పరిశ్రమలు, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల గురించి ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలూ చర్చించనున్నట్లు పేర్కొంది. ప్రధానంగా ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో భద్రత, రక్షణ రంగంలో వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకునేందుకు జో బైడెన్‌తో కీలక చర్చలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది.

జూన్‌ 22 నుంచి ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికన్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలోనూ ప్రధాని ప్రసంగించనున్నారు. అక్కడి సంయుక్త సమావేశాల్లో మోదీ ప్రసంగించడం రెండోసారి. ‘‘ ఈ పర్యటన గురించి ప్రత్యేకించి చెప్పడానికేం లేదు. పర్యటన మొదలైన తర్వాత మరిన్ని అంశాలపై మాట్లాడుకునేందుకు వీలుంటుంది. మోదీ పర్యటన ఇరుదేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తుంది. అమెరికా, భారత్‌ మధ్య సంబంధాలను మరింత దృఢమయ్యేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుంది.’’ అని వైట్‌హౌస్‌ కార్యదర్శి కరైన్‌ జీన్‌ పియర్రీ తెలిపారు.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు బైడెన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, అమలు చేస్తున్న విధివిధానాలకు మద్దతుగా ప్రధాని మోదీ పర్యటన సాగుతుందని ఇటీవల భారత ప్రభుత్వం కూడా వెల్లడించింది. బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021లో ప్రధాని మోదీ వైట్‌హౌస్‌లో ఆయన్ను కలిశారు. గత నెలలో ఆధునిక డిఫెన్స్‌, కంప్యూటింగ్ టెక్నాలజీతోపాటు జనరల్‌ ఎలక్ట్రిక్‌ జెట్‌ ఇంజిన్‌ తయారీకి సంబంధించి అవసరమైన సాంకేతికత అభివృద్ధికి ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని, స్నేహపూర్వక సబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని