Modi: ‘కాంగ్రెస్‌ లేకపోతే ఎమర్జెన్సీ వచ్చేది కాదు.. సిక్కుల ఊచకోత జరిగేదే కాదు..’

వారసత్వ రాజకీయ పార్టీలే భారత ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఏ పార్టీలోనైనా కుటుంబానికే అధిక ప్రాధాన్యమిస్తే.. అప్పుడు

Updated : 08 Feb 2022 20:07 IST

రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

‘‘కాంగ్రెస్‌ లేకపోతే ఏం జరిగేదో తెలుసా.. అని కొందరు సభ్యులు అడుగుతున్నారు.. వాళ్లకి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే.. కాంగ్రెస్సే లేకపోతే ఎమర్జెన్సీ ఉండేదే కాదు.. సిక్కుల ఊచకోత జరిగేది కాదు.. కులతత్వ రాజకీయాలు, కశ్మీర్‌ పండిట్ల సమస్యలూ వచ్చేవే కావు’’ - ప్రధానమంత్రి నరేంద్రమోదీ

దిల్లీ: వారసత్వ రాజకీయ పార్టీలే భారత ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఏ పార్టీలోనైనా కుటుంబానికే అధిక ప్రాధాన్యమిస్తే.. అప్పుడు ప్రతిభకు అతిపెద్ద నష్టం వాటిల్లుతుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ... ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, ఆ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రధాని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ కారణంగా ఈ దేశ ప్రజలు నీరు, విద్యుత్‌, రోడ్ల వంటి కనీస సదుపాయాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చిందంటూ విమర్శల జడివాన కురిపించారు.

‘‘కాంగ్రెస్‌ సమస్య ఏంటంటే.. వారసత్వానికి మించి ఆలోచించలేదు. ఆనాడు మహాత్మా గాంధీ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని కోరుకున్నారు. ఎందుకంటే ఆ పార్టీ కొనసాగితే ఏం జరుగుతుందో ఆయనకు ముందే తెలుసు. ఒకవేళ ఆయన కోరిక నెరవేరి ఉంటే.. భారత్‌ బంధుప్రీతి రాజకీయాల నుంచి ఏనాడో స్వేచ్ఛ పొందేది’’ అని మోదీ దుయ్యబట్టారు. ఆ పార్టీ అర్బన్‌ నక్సల్స్‌ సిద్ధాంతంలో చిక్కుకుపోయిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన అలాంటి పార్టీ నుంచి తాము నేర్చుకునేది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ తీరుతో తెలుగు రాష్ట్రాలకు నష్టం..

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్నీ ప్రధాని ప్రస్తావించారు. ‘తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుతంగా అందరూ కలిసి కూర్చుని, చర్చించి బిల్లులను పాస్‌ చేశారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదు. నాడు కాంగ్రెస్‌ హయాంలో మైకులు ఆపేశారు. కాంగ్రెస్‌ సభ్యులు పెప్పర్‌ స్ప్రే కొట్టారు. ఎలాంటి చర్చ లేకుండా ఏపీని విభజించారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. కాంగ్రెస్‌ అహంకారం, అధికార కాంక్షకు ఇదే నిదర్శనం. ఏపీ విభజన తీరు సరిగ్గా లేదు. సరిగ్గా విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావు’’ అని మోదీ కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.

చెడు రోజుల నుంచి బయటపడ్డాం..

ఈ సందర్భంగా గత ఏడేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, కరోనాను ఎదుర్కొన్న విధానం, ఉపాధి కల్పన, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదుగుతున్న తీరును ఆయన వివరించారు. నాటి చెడు రోజుల నుంచి బయటపడి స్వయం సమృద్ధ భారత్‌ కోసం కేంద్రం చేపట్టిన చర్యలు ఎంతగానో దోహదం చేశాయన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగం అతిపెద్ద ఉపాధికల్పన రంగంగా మారిందన్నారు. వ్యవసాయ రంగం గణనీయ పురోభివృద్ధి సాధిస్తున్నట్లు తెలిపారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తోందని, ఆ ఉత్పత్తులకు రైతులు అత్యధిక కనీస మద్దతు ధర పొందుతున్నారని తెలిపారు. పంట ఉత్పత్తుల సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేస్తున్నట్లు చెప్పారు. యువత క్రీడారంగంలో రాణిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేస్తున్నారని తెలిపారు. విపత్తు వేళ యువత తమదైన ముద్రతో దేశం గర్వించేలా చేసిందన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీతో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని