Wrestlers protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై (Brij Bhushan Sharan Singh) చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్న ప్రముఖ రెజ్లర్లు (Wrestlers Protest)పై పోలీసులు దురుసుగా వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Updated : 28 May 2023 21:24 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై (Brij Bhushan Sharan Singh) చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ ప్రముఖ రెజ్లర్లు (Wrestlers Protest) చేపట్టిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జంతర్‌ మంతర్‌ నుంచి మార్చ్‌ నిర్వహించిన క్రీడాకారులు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌, బజ్‌రంగ్‌ పునియాలను అడ్డుకున్న పోలీసులు.. వారిని నిర్బంధించి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా రెజ్లర్లపై దిల్లీ పోలీసులు అనుచితంగా వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై దిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్ స్వాతి మాలివాల్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా.. పలు రాజకీయ పార్టీలు, క్రీడాకారులు కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు.

‘డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయడంతోపాటు క్రీడాకారులను విడుదల చేయాలి. వీటితోపాటు రెజ్లర్లపై చేయిచేసుకున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ను అక్కడి మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలివాల్‌ డిమాండ్‌ చేశారు.

‘భాజపా ప్రభుత్వానికి అహంకారం మరింత ఎక్కువైంది. ఆందోళన చేస్తున్న మహిళా క్రీడాకారులపై కనికరం లేకుండా అణచివేస్తున్నారు’ అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు.

దేశ గౌరవాన్ని పెంచే మన క్రీడాకారులతో దురుసుగా ప్రవర్తించడం తప్పని.. ఇది తీవ్ర గర్హనీయమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌లపై దిల్లీ పోలీసులు చేయిచేసుకోవడంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం సహనంతో ఉందని.. కానీ, అణచివేత శక్తులు మాత్రం అసహనంతో ఉన్నాయని మండిపడ్డారు.

తమపై జరిగిన వేధింపులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రెజ్లర్లపై పోలీసులు అనుసరించిన తీరును నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) నేత సుప్రియా సూలే ఖండించారు. ‘వారిపై చేయిచేసుకునేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిందా..? దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

కమ్యూనిస్టు పార్టీ కూడా దీన్ని ఖండించింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు పొందిన క్రీడాకారులను బస్సుల్లో ఎక్కించగా.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రం కొత్త పార్లమెంటు భవనంలో కూర్చోవడం నిజంగా సిగ్గుచేటు అని సీపీఐ(ఎం) మండిపడింది.

ఇలా రెజ్లర్ల ఆందోళనను అడ్డుకునే క్రమంలో దిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులతోపాటు క్రీడాకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు, రెజ్లర్లు చేపట్టిన నిరసనకు మద్దతుగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ ‘మహిళా మహా పంచాయత్‌’కు పిలుపునిచ్చింది. అయితే, ఇందులో పాల్గొనేందుకు హరియాణా నుంచి బయలుదేరిన అనేకమంది రైతు నేతలను పోలీసులు నిర్బంధించారని బీకేయూ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని