Ramnath: రైలులో ప్రయాణించిన రాష్ట్రపతి 

దేశ ప్రథమపౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రైలు ప్రయాణం చేశారు. దిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వస్థలం కాన్పూర్‌కు శుక్రవారం ఆయన రైలులో బయల్దేరారు

Updated : 25 Jun 2021 15:40 IST

దిల్లీ: దేశ ప్రథమపౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రైలు ప్రయాణం చేశారు. దిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వస్థలం కాన్పూర్‌కు శుక్రవారం ఆయన రైలులో బయల్దేరారు. దిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక రైలు ఎక్కారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, రైల్వే బోర్డు ఛైర్మన్‌, సీఈవో సునీత్‌ శర్మ స్వయంగా వచ్చి వారికి వీడ్కోలు పలికారు.

రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోవింద్‌ తన స్వస్థలానికి వెళ్లడం ఇదే తొలిసారిని రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న రైలు.. కాన్పూర్‌ సమీపంలోని జింఝాక్‌, రూరా ప్రాంతాల్లో రెండు సార్లు ఆగనుంది. అక్కడ కోవింద్‌ తన పాఠశాల రోజుల్లో పరిచయమున్న వ్యక్తులతో కాసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత ఆయన తన సొంతూరికి చేరుకుంటారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించి.. తిరిగి జూన్‌ 28న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో రైలెక్కి లఖ్‌నవూ వెళ్తారని రాష్ట్రపతి భవన్‌ తెలిపింది. లఖ్‌నవూలో రెండు రోజుల పర్యటన అనంతరం జూన్‌ 29 సాయంత్రం ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకుంటారని పేర్కొంది. 

రాష్ట్రపతి ఇలా రైలులో ప్రయాణించడం 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. అంతకుముందు 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మిలిటరీ అకాడమీ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు హాజరయ్యేందుకు దిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలులో ప్రయాణించారు. ఇక భారత తొలి ప్రథమ పౌరుడు రాజేంద్ర ప్రసాద్‌ కూడా రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు రైలు ప్రయాణాలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు