మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్‌ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ

కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది.  

Updated : 29 Apr 2024 14:48 IST

బెంగళూరు: జేడీఎస్‌ నేత, హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారం కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో దుమారం రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో వెలుగుచూసిన ఈ ఘటనపై సొంత పార్టీనుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని జేడీఎస్ ఎమ్మెల్యే శరణ్‌గౌడ కంద్కూర్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అగ్రనాయత్వానికి లేఖ రాశారు. ‘‘ఆ వీడియోలు ఇబ్బందికరంగా పరిణమించాయి. అవి పార్టీతో పాటు మీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి’’ అని దేవెగౌడకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు.

‘‘ఆయనపై భుజం మీద చేయివేసి ప్రధాని ఫొటో దిగారు. 10 రోజుల కిందట స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. వేదికపైనే ప్రశంసించారు. ఇప్పుడు ఆ కర్ణాటక నేత విదేశాలకు పారిపోయారు. ఈ ఘోరాల గురించి తెలిసిన తర్వాత తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఎందరో మహిళలు జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు కూడా మోదీ మౌనంగా ఉంటారా..?’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ‘‘ఇంకా జేడీఎస్‌తో భాజపా ఎందుకు పొత్తు కొనసాగిస్తోంది..? ఈ ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అని హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

హాసన సెక్స్‌ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే

ఇదిలా ఉంటే.. ఇదే విషయమై గత డిసెంబర్‌లో రాష్ట్ర యూనిట్‌కు తాను లేఖ రాసినట్లు తాజాగా భాజపా నేత దేవరాజె గౌడ వెల్లడించారు. దాదాపు 3వేల అభ్యంతరకర వీడియోలున్న పెన్‌డ్రైవ్ తనకు అందిందని చెప్పారు. వాటిని ఉపయోగించి ప్రజ్వల్‌ పలువురు మహిళలను బ్లాక్‌ బెయిల్ చేసేవారని ఆరోపించారు. జేడీఎస్ చీఫ్ దేవెగౌడ కుటుంబంలోని చాలామంది వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇదే తరహా పెన్‌డ్రైవ్ కాంగ్రెస్ జాతీయ నాయకుల వద్ద కూడా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘ జేడీఎస్‌తో పొత్తుపెట్టుకొని, హాసన నుంచి ఆ పార్టీ అభ్యర్థిని పోటీలో ఉంచితే.. వీడియోలను అస్త్రాలుగా ఉపయోగించుకుంటారు. రేపిస్టులతో  పొత్తు పెట్టుకున్న పార్టీగా మనకు విమర్శలు వస్తాయి. ఇది మన పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది’’ అని అందులో ఆందోళన వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హసన్‌ స్థానం నుంచి ప్రజ్వల్‌ మరోసారి బరిలో దిగారు. ఏప్రిల్‌ 26నే ఈ స్థానానికి పోలింగ్‌ ముగిసింది. అయితే.. పోలింగ్‌కు ముందు నుంచే ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు హసన్‌ జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఆయన దేశం విడిచి వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ప్రజ్వల్ విషయంలో ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, తప్పు చేస్తే శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి తెలిపారు. అతడు విదేశాలకు వెళ్లడంలో తన ప్రమేయం లేదన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని