G20 Summit: భారత్‌కు అదెంతో గర్వకారణం.. శశిథరూర్‌ ప్రశంసలు

‘దిల్లీ డిక్లరేషన్‌’ (Delhi Declaration)పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు భారత్‌ చేసిన కృషిని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ కొనియాడారు.

Published : 10 Sep 2023 13:33 IST

దిల్లీ: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సుపై (G20 Summit) కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ప్రశంసలు కురిపించారు. ‘దిల్లీ డిక్లరేషన్‌’ (Delhi Declaration)పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడంతో భారత్‌ చేసిన కృషిని కొనియాడారు. ఇది భారత్‌కు ఎంతో గర్వకారణమన్న ఆయన.. మన దేశం తరఫున షెర్పాగా ఉన్న అమితాబ్‌ కాంత్‌ పాత్రను అభినందించారు. శిఖరాగ్ర సదస్సులో భాగంగా దిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో శశిథరూర్‌ (Shashi Tharoor) ఈ విధంగా స్పందించారు.

ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం విషయంలో ‘దిల్లీ డిక్లరేషన్‌’ తీర్మానంలో భారత్‌ పేర్కొన్న ‘పేరా’కు సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. అయితే, ఈ ఏకాభిప్రాయం ఎలా సాధ్యమైందనే విషయాన్ని భారత్‌ షెర్పాగా వ్యవహరించిన అమితాబ్‌ కాంత్‌ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో ఈ కథనాన్ని ట్యాగ్‌ చేసిన థరూర్‌.. ‘అమితాబ్‌ కాంత్‌..బాగా పనిచేశారు. మీరు ఐఏఎస్‌ ఎంచుకున్నప్పుడు.. ఐఎఫ్‌ఎస్‌ దూకుడైన దౌత్యవేత్తను కోల్పోయింది. రష్యా, చైనాతో జరిపిన చర్చల అనంతరం దిల్లీ డిక్లరేషన్‌పై ఓ ముసాయిదాను రూపొందించినట్లు చెప్పారు. జీ20 సదస్సులో నిజంగా ఇది భారత్‌కు ఎంతో గర్వకారణం’ అని శశిథరూర్‌ పేర్కొన్నారు.

అణు బెదిరింపులు తగవు..‘న్యూదిల్లీ డిక్లరేషన్‌’కు కూటమి ఆమోదం

పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలగడం భారత్‌కు అతిపెద్ద విజయంగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం అంశంలో తలెత్తిన పీటముడిని చాకచక్యంగా పరిష్కరించగలిగిందని పేర్కొంటున్నారు. సంయుక్త ప్రకటనలో సంబంధిత పేరాను సవరించడం ద్వారా అన్ని దేశాల మద్దతును భారత్‌ సాధించిందని చెబుతున్నారు. దిల్లీ డిక్లరేషన్‌ ఏకాభిప్రాయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో అగ్రదేశాల నుంచి భారత్‌పై ప్రశంసలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని