Rahul Gandhi: ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్‌’ ఎందుకు..? రాహుల్‌ గాంధీ ఏం చెప్పారంటే..

ఎన్నికల ప్రచార క్రమంలో రాహుల్‌ గాంధీ కొన్ని సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఎప్పుడు తెలుపు రంగు టీ-షర్ట్‌ ఎందుకు ధరిస్తారు? అనేదానికి బదులిచ్చారు.

Published : 05 May 2024 21:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) దేశమంతా చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో నిర్వహించిన ప్రచార క్రమంలో ఆయన కొన్ని సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఎప్పుడు తెలుపు రంగు టీ-షర్ట్‌ ఎందుకు ధరిస్తారు? అనే ప్రశ్నకు బదులిస్తూ.. దీనికి రెండు కారణాలు ఉన్నాయన్నారు. పారదర్శకత, నిరాడంబరతను ఇది చాటుతుందని చెప్పారు. తాను దుస్తుల గురించి పెద్దగా పట్టించుకోనని, సాదాసీదా వస్త్రాలకే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.

‘‘సంస్థాగత స్థాయిలో, జాతీయ స్థాయిలో పోరాటం ఎల్లప్పుడూ భావజాలానికి సంబంధించినదే. దానిపై స్పష్టమైన అవగాహన లేకుండా.. అధికారాన్ని సాధించలేం. పేద, మహిళా అనుకూల విధానాలు, బహుళత్వం, అందరినీ సమానంగా చూడటం వంటివాటితో కూడిన మా సిద్ధాంతాన్ని జనాల్లోకి తీసుకెళ్లి, వారిని ఒప్పించగలగాలి’’ అని పార్టీ భావజాలం విషయంలో రాహుల్‌ మాట్లాడారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సమయంలో తాను 70 రోజుల పాటు రోడ్డుపైనే ఉన్నానని చెప్పారు.

ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

ప్రచార సమయంలో ప్రసంగాలు చేయడమంటే ఇష్టమని.. దేశానికి ఏం అవసరమో అవి ఆలోచించేలా చేస్తాయని తెలిపారు. మొత్తం ప్రచార పర్వంలో నచ్చే అంశం ఏంటనే దానికి స్పందిస్తూ.. అది ముగియడమేనని చమత్కరించారు. ఇదే విషయంలో మీకు నచ్చేది, నచ్చనిది ఏంటంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాహుల్‌ అడిగారు. ‘‘దేశం కోసం చేస్తున్నాం కాబట్టి అది మంచి పనే. దేశాన్ని నాశనం చేసే వారిని అడ్డుకునే పనిలో నిమగ్నమవడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. దేశం కోసం ఏదైనా చేస్తున్నామనే భావన కలుగుతుంది’’ అని ఖర్గే బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని