Rahul Gandhi: ‘కింగ్‌’ని ప్రశ్నిస్తే.. 57 మంది ఎంపీలు అరెస్ట్‌.. 23 మంది సస్పెన్షన్‌: రాహుల్‌

ప్రధానిని ‘కింగ్‌’గా అభివర్ణించిన ఆయన.. నిరుద్యోగం, ఆర్థికమాంద్యంపై కింగ్‌ని ప్రశ్నిస్తే 57 మంది ఎంపీలను అరెస్టు చేయడంతోపాటు 23 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు.

Published : 27 Jul 2022 22:28 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానిని ‘కింగ్‌’గా అభివర్ణించిన ఆయన.. నిరుద్యోగం, ఆర్థిక మాంద్యంపై కింగ్‌ని ప్రశ్నిస్తే 57 మంది ఎంపీలను అరెస్టు చేయడంతోపాటు 23 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటులో సభ్యుల ప్రశ్నలకు ‘కింగ్‌’ భయపడిపోతున్నారని విమర్శించారు.

‘గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1053..?, పెరుగు-ధాన్యాలపై జీఎస్టీ..? ఆవ నూనె ధర రూ.200..?.. ఇలా దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయని అడగడంతోపాటు నిరుద్యోగంపై కింగ్‌ (ప్రధాని మోదీని)ని ప్రశ్నించినందుకు 57 మంది ఎంపీలను అరెస్టు చేశారు. 23 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేశారు’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు.

జీఎస్టీ, నిత్యావసరాలు, గ్యాస్‌, ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాల్ని స్తంభింపజేస్తున్న విషయం తెలిసిందే. ప్లకార్డులు చేతబట్టి, వెల్‌లోకి దూసుకొచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇలా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో వివిధ పార్టీలకు చెందిన 19మంది రాజ్యసభ సభ్యులు, మరో నలుగురు లోక్‌సభ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరితో పాటు పార్లమెంట్‌ బయట నిరసన చేపట్టిన ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల రాహుల్‌ తీవ్రంగా మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు