Asharam Bapu: అది సాధారణ నేరం కాదు.. ఆశారామ్‌కు సుప్రీంలో చుక్కెదురు

ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆధ్యాత్మిక గురువు ఆశారామ్‌ బాపునకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది....

Published : 31 Aug 2021 22:21 IST

దిల్లీ:  ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆధ్యాత్మిక గురువు ఆశారామ్‌ బాపునకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జోధ్‌పూర్‌ జైలులో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న ఆయన తాజాగా పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉత్తరాఖండ్‌లో వైద్య చికిత్స కోసం తన శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరుతూ ఆశారామ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ బేల ఎం.త్రివేదిలతో ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఇందిరా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూసినప్పుడు ఇదేమీ సాధారణమైన నేరం కాదన్నారు. ఆశారామ్‌కు జైలులోనే ఆయుర్వేదిక్‌ వైద్యం చేయించుకోవచ్చన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసేలా జైలు అధికారులను ఆదేశిస్తామని తెలిపారు.  

మరోవైపు, ఆయుర్వేదిక్‌ వైద్యం కోసం 85 ఏళ్ల ఆశారామ్‌కు రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది ఆర్‌ బసంత్‌ కోరారు. జైలులో ఆయన సరైన వైద్యం పొందలేకపోతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆశారామ్‌కు బెయిల్‌ మంజూరును వ్యతిరేకిస్తూ సీనియర్‌ న్యాయవాది మనీష్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. జోధ్‌పూర్‌ జైలులో ఆశారామ్‌కు మంచి వైద్యమే అందుతోందని పేర్కొన్నారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం బెయిల్‌  ఇచ్చేందుకు నిరాకరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని