Ayodhya: అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. తొలిరోజే 5 లక్షల మంది!

అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు లక్షల మంది చారిత్రక నగరానికి చేరుకుంటున్నారు. తొలిరోజే దాదాపు 5 లక్షల మంది దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 23 Jan 2024 19:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అయోధ్య రామ మందిరానికి (Ayodhya Ram Mandir) భక్తులు పోటెత్తారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరుసటి రోజు నుంచే (జనవరి 23) సామాన్య భక్తులకు అనుమతిస్తుండటంతో లక్షల మంది అక్కడికి చేరుకుంటున్నారు. మంగళవారం ఉదయం 3గంటల నుంచే ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రధాన మార్గమైన ‘రామ్‌పథ్‌’ (Ram Path) వీధులన్నీ జనసంద్రమయ్యాయి. తొలిరోజు మధ్యాహ్నానికి 2.5 నుంచి 3 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా. అంతేకాక అదే స్థాయిలో ఆలయం బయట భక్తులు వేచిచూస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

శ్రీరాముడి దర్శనం కోసం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను ఆలయ కాంప్లెక్సులోని అనుమతించారు. ఇలా మధ్యాహ్నం 2 గంటల వరకే దాదాపు 2.5 లక్షల మంది దర్శించుకున్నట్లు అయోధ్య డివిజనల్‌ కమిషనర్‌ గౌరవ్‌ దయాల్‌ అంచనా వేశారు. మొదటి రోజు మొత్తంగా దాదాపు 5లక్షల మంది సందర్శించుకునే అవకాశం ఉందన్నారు.

8 వేల మంది పోలీసులు..

ఉదయం 7 నుంచి 11.30 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో వారిని నియంత్రించడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రధాన గేటు వద్ద జనం కిక్కిరిసిపోవడంతో మధ్యాహ్నం ఆలయం తిరిగి తెరవడం ఇబ్బందిగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 8000 మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. డైరెక్టర్‌ జనరల్‌, హోంశాఖ ఉన్నతాధికారులు ఆలయం లోపలే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విపరీతమైన రద్దీ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) హెలికాఫ్టర్‌లో రామమందిరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

ఇదిలాఉంటే, జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ముందే ప్రకటించింది. దీంతో ప్రాణప్రతిష్ఠ జరిగిన రాత్రి నుంచే ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. అయోధ్యకు వచ్చే దారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. దీంతో 30 కి.మీ. దూరం నుంచే వాహనాలను నియంత్రిస్తున్నారు. అనేకమంది కాలినడకన అయోధ్య నగరానికి చేరుకుంటున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని