Covid Deaths: రష్యాలో ఆగని కరోనా మరణమృదంగం!

రష్యాను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. గత కొన్ని వారాలుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది.

Published : 20 Nov 2021 18:33 IST

మాస్కో: రష్యాను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. గత కొన్ని వారాలుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ ముసురుకుంటోంది. కొత్త కేసులు, మరణాలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ కొవిడ్‌ మృతుల సంఖ్య 1200లకు పైగా నమోదైంది. దేశంలో బుధవారం 1247 మంది కొవిడ్‌తో మృత్యువాత పడగా.. గురువారం 1251, శుక్రవారం 1254 మంది చొప్పున మరణించారు. అలాగే, శనివారం కూడా 1254మంది కరోనా కాటుకు బలికాగా.. 37,120మందికి ఈ మహమ్మారి సోకినట్టు రష్యా కరోనా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు. గత కొన్ని వారాలుగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గినట్టు కనబడినప్పటికీ.. గతంలో కన్నా అధికంగా కేసులు, మరణాలు నమోదుకావడం గమనార్హం. 

వ్యాక్సినేషన్‌ రేటు మందగించడం, కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు అలసత్వ ధోరణిని ప్రదర్శించడమే తాజాగా ఈ మహమ్మారి పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలో తొలిసారి రష్యాలోనే కరోనా టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఇప్పటిదాకా కేవలం 40శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయిలో టీకా మోతాదులు అందాయి. రష్యాలో ఇప్పటివరకు 9.3మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. 2,62,843మంది ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. వాస్తవంగా ఈ సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. యూరప్‌ దేశాలతో పోలిస్తే రష్యాలోనే కరోనా ఉద్ధృతి అధికం.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని