Manish Sisodia: మనీశ్‌ సిసోదియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలెక్కడ..?: దర్యాప్తు సంస్థలకు సుప్రీం ప్రశ్న

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలున్నాయని సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థలను సూటిగా ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా సరైన ఆధారాలను చూపించలేదని వ్యాఖ్యానించింది.

Published : 05 Oct 2023 16:24 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Delhi excise policy scam case) కేసులో ఆప్‌ నేత, దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)కు సంబంధించిన రెండు బెయిల్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర ఏజెన్సీలకు సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో సిసోదియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలున్నాయని ప్రశ్నించింది.

కొందరు వ్యక్తులకు లబ్ధిచేకూరే విధంగా ఈ మద్యం విధానాన్ని రూపొందించారని సీబీఐ ఆరోపించింది. ఇందుకు సంబంధించి కొన్ని వాట్సాప్‌ సందేశాలను సీబీఐ కోర్టుకు సాక్ష్యంగా సమర్పించింది. అయితే ఆ సందేశాల ఆమోదయోగ్యతపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘వారు దాని గురించి (లంచాలపై విజయ్‌ నాయర్‌, మనీశ్‌ సిసోదియా చర్చలను ఉద్దేశిస్తూ) మాట్లాడుకోవడం మీరు చూశారా? ఈ సాక్ష్యాలు ఆమోదయోగ్యంగా ఉంటాయా? ఇది అప్రూవర్‌గా మారిన ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం కాదా?మరి దీన్నెలా సాక్ష్యంగా భావించగలం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో సిసోదియాకు వ్యతిరేకంగా సరైనా ఆధారాలను చూపించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది.

మద్యం కుంభకోణం కేసులో ‘ఆప్‌’ పేరు..? ఈడీ కసరత్తు

ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త దినేశ్‌ అరోఢా వాంగ్మూలం మినహా సిసోదియాకు వ్యతిరేకంగా ఇంకా ఏం ఆధారాలున్నాయని సుప్రీం ధర్మాసనం దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది. ‘‘మనీశ్ సిసోదియా డబ్బులు తీసుకున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. మరి ఆ డబ్బులు ఆయనకు ఎలా చేరాయి? రూ.100 కోట్లు, రూ.30 కోట్లు అని రెండు సంఖ్యలు చెప్పారు. వాటిని ఎవరు చెల్లించారు? డబ్బులిచ్చినట్లు ఆధారాలెక్కడ? దినోశ్  ఈ కేసులో నిందితుడే. అతడి వాంగ్మూలం కాకుండా ఇంకా ఏమైనా సాక్ష్యాలున్నాయా?’’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు