Russia: పర్యటక వీసాపై రష్యాకు వెళితే.. అరెస్టు చేసి సైన్యంలోకి పంపారు..: భారతీయుల ఆవేదన

రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  

Updated : 06 Mar 2024 11:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia) సైన్యం బాధితుల జాబితాలో భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో ఏడుగురు తమను కాపాడాలని విదేశాంగశాఖను అభ్యర్థించారు. ఈ మేరకు వారు ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి వీడియో విడుదల చేశారు. వీరిలో ఐదుగురిది పంజాబ్‌ కాగా.. ఇద్దరిది హరియాణా. గగన్‌దీప్‌ సింగ్‌, లవ్‌ప్రీత్‌ సింగ్‌, నరైన్‌ సింగ్‌, గురప్రీత్‌ సింగ్‌, హర్ష్‌కుమార్‌, అభిషేక్‌ కుమార్‌గా బాధితులను గుర్తించారు. వీరంతా 24 ఏళ్ల లోపువారే. 

ఈ బృందంలోని ఒకరు పర్యటక వీసాపై రష్యా వెళ్లగా అక్కడ పోలీసులు అరెస్టు చేసి సైన్యంలో హెల్పర్‌గా వెళ్లాలని బెదిరించారన్నారు. లేకపోతే 10 ఏళ్లపాటు జైల్లో ఉండాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలిపారు. ‘‘మమ్మల్ని హెల్పర్లుగా మాత్రమే పనిచేయాలని తొలుత చెప్పారు. కానీ, ఆ తర్వాత సాయుధ శిక్షణలో పేరు నమోదు చేశారు. ఉక్రెయిన్‌లోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాకు ఆహారం పెట్టడంలేదు.. ఫోన్లు లాక్కొన్నారు’’ అని ఆ వీడియోలో పంజాబీ భాషలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏడాది తర్వాత మాత్రమే పంపిస్తామని చెప్పినట్లు మరో యువకుడు పేర్కొన్నాడు. అక్కడి నుంచి సజీవంగా తిరిగి వస్తామన్న నమ్మకం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. 

రణరంగాన్ని తలపించిన ఎర్ర సముద్రం.. పలు నౌకలపై దాడి..!

భారత్‌ నుంచి దాదాపు 100 మంది యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపారన్న సమాచారంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పందించింది. శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. ఈ విషయంపై తాము రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అక్కడ పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అదే సమయంలో భారతీయులు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి దూరంగా ఉండాలని కోరుతున్నట్లు జైస్వాల్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా విదేశాంగ శాఖకు ఈ అంశంపై లేఖ రాశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని