Houthis attack: రణరంగాన్ని తలపించిన ఎర్ర సముద్రం.. పలు నౌకలపై దాడి..!

ఎర్ర సముద్రం నిన్న మరోసారి రణరంగాన్ని తలపించింది. పలు నౌకలపై హూతీలు దాడులు చేశారు. ఒక నౌకను, అందులోని సిబ్బందిని భారత దళాలు కాపాడాయి.

Published : 06 Mar 2024 09:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై నిన్న హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఆ సంస్థ ప్రతినిధి యహ్యా సరెయ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. కొన్ని నౌకా విధ్వంసక క్షిపణులు, డ్రోన్ల సాయంతో రెండు డెస్ట్రాయర్లపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అయితే, యూఎస్‌ఎస్‌ కార్ని లక్ష్యంగా ప్రయోగించిన వీటిని అమెరికా దళాలు కూల్చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అమెరికా దళాలు ఎదురు దాడి చేసి యెమెన్‌ భూభాగంలోని మూడు క్షిపణులు, మరికొన్ని డ్రోన్లను ధ్వంసం చేశాయి. 

మరోవైపు సోమవారం అర్ధరాత్రి ‘ఎంఎస్‌సీ స్కై II ’ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. సాయం కోరుతూ కాల్‌ రావడంతో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా మంగళవారం తెల్లవారు జామున అక్కడకు చేరుకొంది. ఆ వాణిజ్య నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 13 మంది భారతీయులే.

మూడు డేటాకేబుల్స్‌ తెగాయి..

ఎర్ర సముద్రంలో మూడు డేటాకేబుల్స్‌ తెగిపోయినట్లు టెలికం సంస్థలు, ఓ అమెరికా ప్రభుత్వాధికారి ధ్రువీకరించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఆసియా-ఐరోపా మధ్య దాదాపు 25శాతం డేటా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. హెచ్‌జీసీ గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ స్పందిస్తూ.. ఆ ట్రాఫిక్‌ను వేరే కేబుల్స్‌కు మళ్లించేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎలా తెగిపోయాయో కారణం మాత్రం వెల్లడించలేదు. 

వాస్తవానికి సముద్రం అడుగున ఏర్పాటుచేసిన డేటా కేబుల్సే ఇంటర్నెట్‌ను నడిపించే అదృశ్య శక్తి. గత కొన్నేళ్లుగా అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా వంటి కంపెనీలు దీనిలో భారీ ఎత్తున నిధులను పెట్టుబడిగా పెట్టాయి. ఈ కేబుల్స్‌ దెబ్బ తింటే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. 2006లో తైవాన్‌ భూకంపం సందర్భంగా ఒకసారి ఈ కేబుల్స్‌ దెబ్బతిని ఇంటర్నెట్‌ సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని