Manipur: మిలిటెంట్లను విడిపించుకునేందుకు.. సైన్యంపైకి 1500 మంది మహిళలు!

మిలిటెంట్లను విడిపించుకునేందుకుగానూ మణిపుర్‌లోని ఓ గ్రామస్థులు సైన్యాన్ని చుట్టుముట్టారు. ఏకంగా 1500 మంది మహిళలు ఆర్మీపైకి దూసుకెళ్లడం గమనార్హం.

Updated : 25 Jun 2023 12:41 IST

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సైన్యం (Indian Army) అదుపులోకి తీసుకున్న పలువురు మిలిటెంట్ల (Militants)ను విడిపించుకునేందుకుగానూ ఏకంగా 1500 వరకు మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టడం గమనార్హం. దీంతో పౌరుల భద్రత దృష్ట్యా మానవతా దృక్పథంతో వారిని విడిచిపెట్టినట్లు సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. తూర్పు ఇంఫాల్‌ (Imphal East)లోని ఇథం గ్రామంలో ఇది చోటుచేసుకుంది.

నిఘావర్గాల సమాచారంతో గ్రామంలో సైన్యం శనివారం ఓ ఆపరేషన్‌ మొదలుపెట్టింది. తనిఖీల్లో భాగంగా మైతేయ్‌ మిలిటెంట్ గ్రూప్ ‘కేవైకేఎల్‌’కి చెందిన 12 మంది మిలిటెంట్లను అదుపులోకి తీసుకుంది. 2015లో ‘6 డోగ్రా యూనిట్‌’పై ఆకస్మిక దాడితో సహా అనేక ఘటనల్లో ఈ బృందం హస్తం ఉందని ఆర్మీ తెలిపింది. దీంతోపాటు పెద్దఎత్తున ఆయుధాలనూ స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్దఎత్తున గుమిగూడారు.

దాదాపు 1200 నుంచి 1500 మంది మహిళలు సైన్యాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరినా.. ఫలితం లేకపోయింది. ఇలా ఇరువర్గాల మధ్య రోజంతా ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు సైన్యం వారిని విడిచిపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతోన్న సున్నిత పరిస్థితుల నేపథ్యంలో.. ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ తెలిపింది. అయితే, స్వాధీనం చేసుకున్న ఆయుధాలను తరలించినట్లు పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని