Tomato Flu: కేరళలో టమాటో ఫ్లూ.. ఈ వైరస్‌ లక్షణాలేంటీ?

కేరళలో కొత్త రకం వైరస్‌ కలకలం రేపుతోంది. అంతుచిక్కని టమాటో ఫ్లూ కారణంగా అనేక మంది చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. కొన్ని మరణాలు కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్లలోపు

Updated : 11 May 2022 16:33 IST

తిరువనంతపురం: కేరళలో కొత్త రకం వైరస్‌ కలకలం రేపుతోంది. అంతుచిక్కని టమాటో ఫ్లూ కారణంగా అనేక మంది చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. కొన్ని మరణాలు కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఈ వైరస్‌ బారిన పడుతున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 80 మందికి పైగా చిన్నారులకు టమాటో ఫ్లూ సోకినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఇవన్నీ ఒక్క కొల్లం జిల్లాలోనే నమోదవడం గమనార్హం.

ఏంటీ టమాటో ఫ్లూ..

ఈ వైరస్‌ను టమాటో జ్వరంగా కూడా పిలుస్తున్నారు. ఇది అత్యంత అరుదైన వైరస్‌ వ్యాధిగా నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చర్మంపై ఎర్రటి బొబ్బలు వస్తాయి. అవి ఎర్రగా, టమాటో ఆకారంలో ఉండటంతో ఈ వ్యాధికి ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

లక్షణాలు ఇలా..

ఈ వైరస్‌ సోకిన పిల్లల్లో శరీరంపై చాలా చోట్ల బొబ్బలు వస్తాయి. దీంతో పాటు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, బలహీనత, డీహైడ్రేషన్‌ వంటి లక్షణాలు ఉంటాయి. కొందరు పిల్లల్లో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతుల వంటి లక్షణాలు కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఈ వ్యాధికి గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి కేరళలోని కొల్లం జిల్లాలో మాత్రమే ఈ కేసులు నమోదయ్యాయి. అయితే ఇతర ప్రాంతాలకు ఫ్లూ వ్యాపించే ప్రమాదముందని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టమాటో ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తమైంది. కేరళ నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లోనే మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తోంది. అటు కొల్లంలో అంగన్వాడీలను మూసివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని