40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కూల్చేయండి.. నోయిడా కేసులో సుప్రీంకోర్టు ఆదేశం

‘పట్టణ ప్రాంతాలు, మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఇటీవలి కాలంలో అక్రమ నిర్మాణాలు బాగా పెరుగుతున్నాయి. పట్టణ/నగర ప్రణాళిక అధికారులతో కుమ్మక్కై చేపడుతున్న ఇటువంటి నిర్మాణాల...

Published : 01 Sep 2021 07:16 IST

అలహాబాద్‌ హైకోర్టు తీర్పునకు సమర్థన

దిల్లీ: ‘పట్టణ ప్రాంతాలు, మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఇటీవలి కాలంలో అక్రమ నిర్మాణాలు బాగా పెరుగుతున్నాయి. పట్టణ/నగర ప్రణాళిక అధికారులతో కుమ్మక్కై చేపడుతున్న ఇటువంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఈ పరిస్థితుల్లో బాధితులుగా మారుతున్న ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది’ అని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ భారీ ప్రాజెక్టు కింద నిర్మించిన 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కూల్చివేయాల్సిందిగా ‘సుప్రీం’ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి కట్టిన ఈ భవనాలను నిపుణుల పర్యవేక్షణలో మూడు నెలల్లోపు సొంత ఖర్చులతో సూపర్‌టెక్‌ కంపెనీయే కూల్చాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మొత్తం 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఇందులో ఉన్నాయి. ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుక్కొన్న వారికి బుక్‌ చేసుకున్న సమయం నుంచి 12 శాతం వడ్డీతో ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని కోర్టు పేర్కొంది. ఈ అక్రమ నిర్మాణంతో ఎదురైన ఇబ్బందుల కారణంగా రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు మరో రూ.2 కోట్లు చెల్లించాలని తీర్పులో సూచించింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ టవర్స్‌ నిర్మాణంపై 2014 ఏప్రిల్‌ 11న అలహాబాద్‌ హైకోర్టు కూడా ఇదే తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సూపర్‌టెక్‌ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, స్టేటస్‌కో విధించారు. దాదాపు ఏడేళ్ల విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. అందులో ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులను ప్రాసిక్యూట్‌ చేయాలన్న హైకోర్టు అభిప్రాయాన్ని కూడా ‘సుప్రీం’ 140 పేజీల తన తీర్పులో సమర్థించింది. ఈ భవనాల నిర్మాణ సమయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. రెండు టవర్స్‌ మధ్య కనీస దూరం పాటించడం లేదని చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ లేఖ రాసినా నోయిడా అధికారులు పట్టించుకోలేదు. ఈ కేసులో ఇళ్ల కొనుగోలుదారులు 2012 నుంచి బిల్డరుపై న్యాయపోరాటం చేస్తున్నారు.

* ఈ కేసులో బిల్డరు ఇచ్చిన వివరణ మేరకు.. మొత్తం 915 ఫ్లాట్లలో 633 మొదట్లో బుక్‌ అయ్యాయి. తర్వాత అందులో నుంచి 133 మంది వెనక్కుతగ్గి, వేరే ప్రాజెక్టుల వైపు మళ్లారు. 248 మంది ఇప్పటికే సొమ్ము వాపసు తీసుకొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తామని సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎండీ మోహిత్‌ అరోడా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని