Supreme Court: పరిహారాన్ని బీమా కంపెనీ తిరస్కరించవచ్చా?

మినహాయింపు నిబంధన’ల పేరుతో పరిహారం చెల్లించడాన్ని బీమా కంపెనీ తిరస్కరించవచ్చా?

Published : 25 Oct 2021 14:22 IST

పరిశీలించనున్న సుప్రీంకోర్టు 

దిల్లీ: ‘మినహాయింపు నిబంధన’ల పేరుతో పరిహారం చెల్లించడాన్ని బీమా కంపెనీ తిరస్కరించవచ్చా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలన జరపనుంది. ఈ విషయమై ఎనిమిది వారాల్లో సమాధానం చెప్పాలంటూ బీమా కంపెనీతో పాటు, బాధితురాలికి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం నోటీసులు పంపించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే...మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి 2012 సెప్టెంబరు 28న రిలయన్స్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీలో రూ.లక్ష ప్రీమియం చెల్లించి బీమా తీసుకున్నాడు. మరుసటి సంవత్సరం ప్రీమియం చెల్లించకపోవడంతో 2013 సెప్టెంబరు 28న అది మురిగిపోయింది. 2014 ఫిబ్రవరి 25న మళ్లీ ప్రీమియం చెల్లించడంతో దాన్ని పునరుద్ధరించారు. జూన్‌ 30న ఆయన నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బీమా పరిహారం చెల్లించాలని ఆయన భార్య కోరగా అందుకు ఆ కంపెనీ నిరాకరించింది. బీమా నిబంధనల్లోని 9, 12 క్లాజుల ప్రకారం పాలసీ పునరుద్ధరించిన 12 నెలల్లోగా ఆత్మహత్య చేసుకుంటే పరిహారం రాదని తెలిపింది. ఈ ‘మినహాయింపు నిబంధనల’ దృష్ట్యా పరిహారం చెల్లించలేమని వివరించింది. దీనిపై ఆమె జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా రూ.13.48 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై ఆ కంపెనీ జాతీయ వినియోగదారుల ఫోరంలో అప్పీలు చేయగా జిల్లా ఫోరం తీర్పును సమర్థించింది. అంతేకాకుండా బీమా కంపెనీకి రూ.1.5 లక్షల జరిమానా కూడా విధించింది. మళ్లీ ఆ కంపెనీ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.పనికిమాలిన అప్పీళ్లు చేస్తే చర్యలు తప్పవు

ఉత్తరాఖండ్‌ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

పనికిమాలిన అప్పీళ్లు దాఖలు చేసినందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలా చేస్తే అపరాధం కింద చర్యలు తీసుకుంటామని జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ విక్రంనాథ్‌లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. హత్యాయత్నం కేసులో విధించిన శిక్షను తగ్గించాలని ఓ ముద్దాయి కోరగా, అక్కడి హైకోర్టు అంగీకరించింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలపలేదు. తీరా ఆదేశాలు జారీ చేసిన తరువాత శిక్ష తగ్గించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. దీనిని ధర్మాసనం తప్పుపట్టింది. బాధ్యతారాహిత్యంగా ఈ అప్పీలు దాఖలు చేసినట్టు వ్యాఖ్యానించింది. ముద్దాయికి హైకోర్టు తొలుత ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధించింది. ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని శిక్షను నాలుగేళ్ల అయిదు నెలలు, జరిమానాను రూ.15వేలకు తగ్గించింది. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేయగా, సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని