China: 60 ఏళ్లుగా చైనా నియంత్రణలోనే ఆ గ్రామం

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా ఓ పెద్ద గ్రామాన్ని నిర్మించిన ప్రాంతం దాదాపు 6 దశాబ్దాలుగా ఆ దేశ సైనిక నియంత్రణలోనే ఉందని భారత సైనిక వర్గాలు తెలిపాయి

Updated : 10 Nov 2021 07:02 IST

భారత సైనిక వర్గాల వివరణ

దిల్లీ/ దేహ్రాదూన్‌: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా ఓ పెద్ద గ్రామాన్ని నిర్మించిన ప్రాంతం దాదాపు 6 దశాబ్దాలుగా ఆ దేశ సైనిక నియంత్రణలోనే ఉందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ సెక్టార్‌లోని వివాదాస్పద ప్రాంతంలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించినట్లు ఇటీవల అమెరికా రక్షణ శాఖ నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా భారత సైనిక వర్గాలు స్పందించాయి. 1959లో ఆ ప్రాంతాన్ని చైనా సైన్యం (పీఎల్‌ఏ) ఆక్రమించుకుందని, అప్పటి నుంచి అనేక నిర్మాణాలు చేపట్టిందని.. ఇవేవీ ఇటీవల కాలంలో నిర్మించినవి కావని తెలిపాయి. ‘‘ఎగువ సుబాన్‌సిరి జిల్లా వద్ద వివాదాస్పద సరిహద్దు వెంబడి చైనా గ్రామం నిర్మించుకుంది. 6 దశాబ్దాల క్రితం అస్సాం రైఫిల్స్‌ దళం ఆధ్వర్యంలో ఉన్న శిబిరాన్ని ఆక్రమించుకున్న పీఎల్‌ఏ అక్కడ మోహరించింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉంది’’ అని భారత సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ‘‘మన దేశ సరిహద్దులపై మాకు బాగా అవగాహన ఉంది. వాటి విస్తృతి గురించి చైనాకూ తెలుసు’’ అని భారత త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. దేహ్రాదూన్‌ రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మీడియాతో మాట్లాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని