
Afghan Crisis: తాలిబన్ల ఎఫెక్ట్.. డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు
దిల్లీ: తాలిబన్ల ఆక్రమణలతో అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న కల్లోల పరిస్థితులు భారత్‌పైనా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతులపై తాలిబన్లు నిషేధం విధించడంతో మన దేశంలో డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలొస్తున్నాయి. అసలే కరోనా వేళ.. ఆపై రాబోయేది పండగ సీజన్.. ఇలాంటి సమయంలో సరఫరా నిలిచిపోవడంతో కొద్ది రోజులుగా ఎండుఫలాల ధరలు అమాంతం పెరుగుతున్నాయి.
బాదం, పిస్తా, అంజీర్, ఆప్రికాట్ వంటి పంటలకు అఫ్గానిస్థాన్ పెట్టింది పేరు. మన దేశంలో దిగుమతి అయ్యే మొత్తం డ్రై ఫ్రూట్స్‌లో 85శాతం అక్కడి నుంచే వస్తాయి. అయితే ఇప్పుడు అఫ్గాన్‌ను వశం చేసుకున్న తాలిబన్లు.. భారత్‌తో ఎగుమతులు దిగుమతులు నిలిపివేశారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ తెలిపింది. అక్కడి నుంచి వచ్చే కార్గో రవాణాను నిలిపివేసినట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా భారత్‌కు అఫ్గాన్ నుంచి డ్రైఫ్రూట్స్ దిగుమతులు రాకపోవడంతో వాటి ధరలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఎఫ్‌ఐఈవో ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటికే దిల్లీ, జమ్మూకశ్మీర్ మార్కెట్లలో బాదం, వాల్‌నట్స్, ఆప్రికాట్స్ వంటి ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. మరోవైపు దేశంలో పండగ సీజన్ మొదలవుతుండటంతో ఎండు ఫలాలకు గిరాకీ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్తకం దారులు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల కోసం చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. అఫ్గాన్‌లో కల్లోల పరిస్థితులు ఇప్పుడప్పుడే చక్కబడేలా కన్పించట్లేదు. ఈ నేపథ్యంలో ఎండు ఫలాల దిగుమతులు నిలిచిపోతే తమ వ్యాపారం దెబ్బతింటుందని ట్రేడర్లు ఆవేదన చెందుతున్నారు.
అఫ్గాన్‌తో భారత్‌కు వాణిజ్యపరంగా మెరుగైనా సంబంధాలున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆ దేశం నుంచి భారత్ రూ.3,753 కోట్ల దిగుమతులు చేసుకోగా.. అందులో ఎండుఫలాల విలువ రూ.2,389కోట్లు కావడం గమనార్హం. అఫ్గాన్ నుంచి ఎక్కువగా ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్, బాదం, అంజీర్, పైన్ నట్స్, పిస్తా, ఆప్రికాట్స్ వంటి డ్రైఫ్రూట్స్‌తో పాటు చెర్రీ, పుచ్చకాయ, వంటి పండ్లు భారత్‌కు దిగుమతి అవుతుంటాయి. ఇక ఇక్కడి నుంచి తేయాకు, కాఫీ, మిరియాలు, బొమ్మలు, పత్తి, చెప్పులు తదితర ఉత్పత్తులు ఆ దేశానికి ఎగుమతి అవుతుంటాయి.