బాలా సాహేబ్ బతికుంటే.. ఇలా జరిగేది కాదు..!

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్ ఖాన్‌ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే చుట్టూ పలు ఆరోపణలు చుట్టుముట్టాయి. దీంతో ఆయనపై ఎన్‌సీబీ విచారణ కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య క్రాంతి రేడ్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు

Published : 28 Oct 2021 15:10 IST

మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసిన వాంఖడే భార్య

ముంబయి: డ్రగ్స్‌ కేసులో ఆర్యన్ ఖాన్‌ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే చుట్టూ పలు ఆరోపణలు చుట్టుముట్టాయి. దీంతో ఆయనపై ఎన్‌సీబీ విచారణ కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య క్రాంతి రేడ్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. 

‘మాకు ప్రజల ముందు నిత్యం అవమానాలు ఎదురవుతున్నాయి. ఛత్రపతి శివాజీ రాష్ట్రంలో ఓ మహిళను అగౌరవపరుస్తున్నారు. బాలాసాహేబ్ ఉండి ఉంటే.. ఈ వైఖరి ఆయనకు నచ్చేది కాదు. ఆయన లేరు కానీ, మీరు ఉన్నారు. ఆయనలో మిమ్మల్ని చూసుకుంటున్నాం. మిమ్మల్ని నమ్ముతున్నాం. నాకు, నా కుటుంబానికి అన్యాయం జరగడాన్ని మీరు ఒప్పుకోరని నేను నమ్ముతున్నాను. ఒక మరాఠీ వ్యక్తిగా న్యాయం కోసం మీవైపు చూస్తున్నాను. మాకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థిస్తున్నాను’ అని క్రాంతి ఆ లేఖలో కోరారు. ఆయన్ను కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరామని, ఆయనిచ్చే సమాధానం కోసం చూస్తున్నామని తెలిపారు. మరోపక్క వాంఖడే సోదరి జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురవుతున్నాయని అందులో వెల్లడించారు. 

ముంబయిలోని క్రూజ్ డ్రగ్స్‌ కేసులో నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. అతడితో పాటు పలువురి అరెస్టులు వాంఖడే నేతృత్వంలో జరిగాయి. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎన్‌సీబీ విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. ఆర్యన్‌కు ఇంతవరకు బెయిల్ దొరకలేదు. బాంబే హైకోర్టు ఈ కేసులో వాదనలు వింటోంది. అవి ఈ రోజు కూడా కొనసాగనున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని