President-PM Meet: ప్రధాని కాన్వాయ్‌లోభద్రతా వైఫల్యం.. రాష్ట్రపతి ఆందోళన..!

పంజాబ్‌ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 06 Jan 2022 15:43 IST

రాష్ట్రపతి కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ

దిల్లీ: పంజాబ్‌ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యానికి సంబంధించిన వివరాలను ప్రధాని మోదీ నుంచి అడిగి తెలుసుకున్న రాష్ట్రపతి.. భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రధానమంత్రి పర్యటనలో బయటపడిన భారీ భద్రతా వైఫల్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానితో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు.

ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకున్న భారీ భద్రతా వైఫల్యం వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. దీనిపై సీనియర్‌ న్యాయవాది మనీందర్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉదయం విచారణ జరపనుంది. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి, పంజాబ్‌ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్, హరియాణా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి మెహ్‌తాబ్‌ గిల్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనురాగ్‌ వర్మలతో కూడిన ఈ కమిటీ ఘటనపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని