China Apps: చైనా యాప్స్‌పై నిషేధం.. ఎత్తివేతపై ప్రభుత్వం ఏమందంటే..?

చైనా యాప్స్‌పై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకునే ప్రతిపాదన లేదని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

Published : 15 Dec 2021 23:42 IST

దిల్లీ: చైనా యాప్స్‌పై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకునే ప్రతిపాదన లేదని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. గతంలో నిషేధించిన చైనా యాప్‌లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ప్రతిపాదన ఉందా? అని లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీశాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందనే కారణాలతో గతేడాది వందల సంఖ్యలో చైనా యాప్స్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

ముఖ్యంగా పబ్‌జీ, టిక్‌టాక్‌, విబో, వీచాట్‌, అలీఎక్స్‌ప్రెస్‌ వంటి ఎన్నో యాప్‌లను నిషేధిత జాబితాలో చేర్చింది. 2020 నవంబర్‌ నెలలో 43 యాప్‌లను నిషేధించిన ప్రభుత్వం.. అంతకుముందు జులై 29న 59 యాప్‌లు, సెప్టెంబర్‌ 2న మరో 118 యాప్‌లను నిషేధించింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69-ఏ కింద వీటిని నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. వందల సంఖ్యలో చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడం పట్ల అప్పట్లో డ్రాగన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ యాప్‌లపై ఆంక్షలు విధించడం తమను ఎంతో ఆందోళనకు గురిచేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ వాటిని పునరుద్ధరించే యోచన తమకు లేదని భారత్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని