North Korea: నవ్వొద్దు..తాగొద్దు.. గట్టిగా ఏడ్వొద్దు..!

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పోకడలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తుంటాయి.

Updated : 17 Dec 2021 16:08 IST

ఉత్తర కొరియాలో ఈ ఆంక్షలు ఎందుకో తెలుసా..?

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పోకడలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తుంటాయి. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించి నేటికి 10 సంవత్సరాలు పూర్తి కావడంతో.. ఆయన సంస్మరణార్థం ఆ దేశంలో 11 రోజులు సంతాప దినాలుగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలు విధించారు. ఈ 11 రోజులు వారు నవ్వొద్దు, మద్యం తాగొద్దు, వేడుకలు చేసుకోవద్దు. ఈ నియమాల గురించి చెప్తూ అక్కడి మీడియాలో ప్రకటన జారీ అయ్యింది.

‘ఈ సంతాప దినాల సమయంలో మనం మద్యం సేవించకూడదు. నవ్వకూడదు. వేడుకల్లో పాల్గొనకూడదు’ అంటూ రేడియో ఫ్రీ ఆసియా ప్రభుత్వ ఆదేశాలను వెల్లడించింది. డిసెంబర్ 17న ఆ దేశ ప్రజలు ఎవరూ నిత్యావసరాలు కొనేందుకు దుకాణాలకు వెళ్లకూడదు. ఈ సమయంలో ఎవరైనా మరణిస్తే.. మృతుడి కుటుంబ సభ్యులు బిగ్గరగా ఏడ్వకూడదట. పుట్టిన రోజులు జరుపుకోవడానికి వీలు లేదు. ఇలా పలు ఆంక్షలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో సంతాపదినాల సమయంలో ఆదేశాలకు విరుద్ధంగా కొందరు తాగుతూ పట్టుబడ్డారు. వారిని నేరస్థుల్లా పరిగణిస్తూ.. శిక్షలు వేశారు. ఆ తర్వాత వారి జాడ లేకుండా పోయిందని ఆ వర్గాలు వెల్లడించాయి.

కిమ్ జోంగ్ ఇల్ 1994 నుంచి 2011 వరకు ఉత్తర కొరియాను పాలించారు. తన నియంతృత్వ వైఖరితో ప్రజలకు స్వేచ్ఛను దూరం చేశారు. 2011, డిసెంబర్ 17న గుండెపోటుతో మరణించారు. ఇల్‌ మూడో కుమారుడే కిమ్ జోంగ్‌ ఉన్. కిమ్ జోంగ్ ఇల్ వర్థంతి రోజున ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు సంతాప దినాలు జరుగుతాయి. ఈసారి 10వ వర్థంతి కావడంతో ఆ సంఖ్యను 11 రోజులకు పెంచారు.  

కిమ్ కుటుంబ పాలనలోని ఉత్తర కొరియా ప్రజలకు ఆంక్షలు కొత్తేం కాదు. దేశంలో కరవు తాండవిస్తుండటంతో సరిగ్గా తిండితినే పరిస్థితి లేదు. ఆహార కొరత నెలకొనడంతో కొద్ది నెలల క్రితం కిమ్ చేసిన ప్రకటనపై ప్రపంచం ముక్కున వేలేసుకుంది. కరోనా ఆంక్షలు, సరిహద్దుల మూసివేత, గతేడాది తుపానులు కారణంగా ఆ దేశంలో ఆహార లభ్యత తగ్గి, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమయంలో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్ పిలుపునిచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని